Hydra Commissioner AV Ranganath | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మూసీ నది సుందరీకరణ పనులు చేపట్టడంలో భాగంగా, పరివాహక ప్రాంతాల వారిని వేరే చోటుకు తరలించాలని నిర్ణయించింది. మూసీ నిర్వాసితుల ఇళ్లను గుర్తించి, వారికి కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సైతం భావిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు పేరుతో అమాయకుల ఇళ్లను కూల్చివేసి, వారిని రోడ్డుమీదకు లాగుతుందన్న విమర్శలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుపై రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మూసీ నది పరిధిలో తాము ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. 


మూసీ ప్రాంతాల్లో హైడ్రా ఎలాంటి మార్కింగ్ చేయడం లేదు


మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మూసీ నదిలో ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడం లేదని రంగనాథ్ తెలిపారు. మూసీ నది పరివాహక నివాసితులను హైడ్రా అధికారులు ఎక్కడికి తరలించడం లేదని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.  మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు అని పేర్కొన్న ఆయన.. మూసీ నది ప్రక్షాళనను మూసీ రివర్ంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (Musi River Development Corporation) చేపడుతోందని వివరించారు.






Also Read: KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్ 


జలాశయాల పరిరక్షణే హైడ్రా టార్గెట్


కూల్చివేతలు అనేది హైడ్రా లక్ష్యం కాదని, చెరువులు, నాలాలు, సరస్సుల పునరుద్ధరణ అనేది తమ టార్గెట్ అన్నారు. పేద లేక మధ్యతరగతి ప్రజల ఇళ్లను హైడ్రా కూల్చివేయదని పేర్కొన్నారు. కొందరు హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారు. హైడ్రా అధికార పరిధి ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad ORR) వరకు మాత్రమే విస్తరించి ఉంది. కానీ కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారని.. దాంతో తాము ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. అన్ని కూల్చివేతలు హైడ్రా ద్వారా చేపట్టరని ప్రజలు తెలుసుకోవాలన్నారు. సరస్సులు, చెరువులు, ఇతర జలాశయాలను సంరక్షించడం తమ బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. జలాశయాల సంరక్షణతో పాటు భారీ వర్షాలు, వరదల సమయంలో రోడ్లు, నివాస ప్రాంతాల్లోకి వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.


Also Read: KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్