BRS leader KTR comments on Hydra Demolitions and Musi Riverfront victims at Telangana Bhavan | హైదరాబాద్: ఎన్నో కష్టాలు పడి, త్యాగాలతో రాష్ట్రం సాధించుకుంటే నేడు మరోసారి తెలంగాణ కష్టాల్లో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుల్డోజర్ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు స్పందించి.. హైడ్రా కమిషనర్ ఇష్టపూర్వకంగా వ్యవహరించకూడదని చెప్పడాన్ని స్వాగతించారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ దేని ప్రాతిపదికన చేపట్టారు. ఎందుకోసం, ఎవరి ప్రయోజనాల కూల్చివేతలు చేపట్టేందుకు సిద్ధపడ్డారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం, రైతు బంధును 10 నుంచి రూ.15 వేలు చేస్తాం, తొలిరోజే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. అక్కాచెల్లెమ్మలకు నెలకు నగదు ఇస్తామన్నారు. మూసీ సుందరీకరణకు రూ.1.5 లక్షల కోట్లు ఖర్చుపెడతాం అంటున్నారు. దీంతో ఎవరికి ప్రయోజనం ఉందని’ కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెలలు గడుస్తున్నా హామీల అమల ఊసేలేదు. 420 హామీలిచ్చినా, కొన్ని కూడా అమలు చేయలేదు. 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చింది, రిజిస్ట్రేషన్ అయిందని బాధితులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తాము ఇండ్లు కట్టుకున్నామని, రిజిస్ట్రేషన్ చేపించుకున్నామని బాధితులు చెబుతున్నారు. కరెంట్ బిల్లు, మంచినీళ్ల బిల్లు, ఇతరరత్రా బిల్లులు కట్టినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో ఎలా వచ్చింది. సూర్యాపేట, ఆదిలాబాద్, సంగారెడ్డి లేక రాష్ట్రంలో ఎక్కడైనా పేదల ఇండ్లను కూల్చివేస్తున్నారు. ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో 25 వేల కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు.
నిర్వాసితుల బాధలు మాకు తెలుసు..స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా బాధితుడు. మా కుటుంబం రెండుసార్లు వలసవెళ్లాల్సి వచ్చింది. అప్పర్ మానేరు మునిగితే నాయినమ్మ ఊరు నుంచి వేరే చోటుకు వెళ్లాల్సి వచ్చింది. మా అమ్మమ్మ వాళ్ల ఊరు లోయర్ మానేరు కారణంగా మునిగితే నిర్వాసితులుగా మరో చోటుకు వెళ్లాం. నిర్వాసితుల బాధలు, కష్టాలు మాకు బాగా తెలుసు. అక్కడ వారికి ఎన్నో గుర్తులు, బంధం ఉంటుంది. అకస్మాత్తుగా ప్రభుత్వం వచ్చి ఇండ్లు కూల్చివేస్తుంటే అమాయకుల బాధలు వర్ణణాతీతం. సునీల్ కనుకోలు పేరుతో 500, 600 మందితో టీమ్ పెట్టి అక్రమదారులని ముద్ర వేస్తున్నారు. అందరూ ఎఫ్‌టీఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో ఇండ్లు కట్టుకున్నారని ప్రచారం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే గుడ్డిగుర్రాలకు పళ్లు తోముతూ కూర్చున్నారా. 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారిగా హైదరాబాద్ లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను గుర్తిస్తూ జీవో ఇచ్చింది. 1956 నుంచి 2016 వరకు 60 ఏళ్లు ఒక్క ప్రభుత్వం కూడా వాటి పరిధిని తేల్చలేదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read: Attak On Telangana Bhavan : తెలంగాణ భవన్‌పై కాంగ్రెస్ కార్యకర్తల దాడి - టెన్షన్ టెన్షన్
ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం కూల్చివేతలపై ఫోకస్ చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఇన్నేళ్ల నుంచి అక్కడ ఉంటున్న వారు ఇప్పుడు ఆక్రమణదారులు ఎలా అయ్యారో చెప్పాలన్నారు. హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేవంట. కానీ మూసీ సుందరీకరణకు మాత్రం రూ.1.5 లక్షల కోట్లు ఎలా సమకూర్చుకుంటారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. నమామి గంగే ప్రాజెక్టుకు 2,400 కిలోమీటర్లకు రూ.40 వేల కోట్లు ఖర్చు అని కేంద్రం చెప్పింది. కేవలం 55 కిలోమీటర్లు ఉన్న మూసీ సుందరీకరణకు రూ.1.5 లక్షల కోట్లు ఎలా అవుతాయి, ఇందులో మతలబు ఏంటని నిలదీశారు.