భాగ్యనగర జంట జలాశయాలు నీటితో తొణికిసలాడుతున్నాయి. ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్‌లకు భారీగా వరద వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు.. వరద నీటి ప్రవాహంతో హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. అయితే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి నగరానికి నీటిని తరలించడానికి ప్రతి వెయ్యి లీటర్లకు 10 రూపాయల లోపే ఖర్చవుతుంది. అదే కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్‌కు తెచ్చేందుకు అయ్యే ఖర్చు ప్రతి వెయ్యి లీటర్లకు 50 రూపాయలు. ఇందులో ఏది మెరుగు అంటే…ఎవ్వరైనా మొదటి ఆప్షనే చెబుతారు. కానీ జలమండలి అధికారులకు మాత్రం ఇది పట్టడం లేదు. వేల క్యూసెక్కుల నీరు మూసీపాలవుతున్నా చోద్యం చూస్తున్నారు.
కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు రాకముందు హైదరాబాద్ వాసులకు జంట జలాశయాలే దిక్కు. ఉస్మాన్‌సాగర్ నుంచి 25 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్ నుంచి 15 ఎంజీడీలు నిత్యం తరలించేవారు. జనాభా పెరగడంతో నీరు సరిపోక కృష్ణా మూడు దశలు, గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. నగరానికి 200 కిలోమీటర్ల నుంచి మూడు దశల పంపింగ్‌తో కృష్ణా నుంచి 270 ఎంజీడీలు, గోదావరి నుంచి 172 ఎంజీడీలు తీసుకొస్తున్నారు. కొన్ని రోజులుగా వానలు పడుతుండటంతో జంట జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ రెండు గరిష్ఠ నీటిమట్టాలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి మూసీలోకి విడిచిపెడుతున్నారు.
వాస్తవానికి మూసీలోకి వదులుతున్న నీటిని తాగునీటి అవసరాలకు కూడా వాడుకునే వీలు ఉంది. ఇందుకోసం పక్కా వ్యవస్థ అందుబాటులో ఉంది. కానీ జలమండలి వర్గాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. గతంలోనూ ఇదే పరిస్థితి. అప్పట్లో వానలు లేవు. భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం భారీగా వరద వస్తున్నా…అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోకుండా..ఇప్పటికీ కృష్ణా, గోదావరి జలాలపైనే ఆధారపడుతుండటం విమర్శలకు తావిస్తోంది.
మూడు నాలుగు రోజులుగా వానలు తగ్గడంతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు వరదనీటి ఉద్ధృతి తగ్గింది. వరద ఉధృతి కొనసాగినప్పుడు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలిపెట్టిన అధికారులు… వానలు తగ్గాక ఉన్నతాధికారుల సూచనల మేరకు రెండు జలాశయాల గేట్లు మూసేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద నీరు తగ్గుముఖం పట్టింది. వరద ప్రవాహం తగ్గడంతో జంట జలాశయాల గేట్లు మూసివేశారు. ఇప్పటి వరకు హిమాయత్ సాగర్ లోకి 1200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ఐదు గేట్లు ఎత్తి.. 1715 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ గరిష్ట నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.25 అడుగుల వరకు నీరు నిలిచి ఉంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ లోకి 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1785.80 అడుగులకు నీరు చేరింది.