Telugu News: తెలంగాణలో నిరుద్యోగుల నిరసనలు మరింత ఎక్కువ అయ్యాయి. హైదరాబాద్ లో నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తా వద్ద గత అర్ధరాత్రి భారీ ఎత్తున ఆందోళనలు చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచిన తర్వాతే డిసెంబర్ లో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు భారీ ర్యాలీతో అశోక్ నగర్ చౌరస్తాలో రాస్తారోకో కూడా నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతం అంతా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
డీఎస్సీ, గ్రూప్ - 2, గ్రూప్ - 3 పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మెరుపు ఆందోళనను అర్ధరాత్రి నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మీదుగా అశోక్ నగర్ క్రాస్ రోడ్ వరకూ చేరుకున్నారు. దాదాపు వందల మంది నిరసన కారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని, డీఎస్సీని వాయిదా వేయాలని నినాదాలు చేస్తూ రోడ్లపై కూర్చున్నారు.
అశోక్ నగర్ వద్ద ఆందోళనలో భాగంగా ఓ యువతి నిద్రమాత్రలు మింగింది. దీంతో ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సరికాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ నగర్ వద్ద ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అటు ఇదే డిమాండ్‌తో ఓయూతోపాటు దిల్‌సుఖ్ నగర్ లో కూడా నిరుద్యోగులు ఆందోళనలు చేశారు. అభ్యర్థులు ఆందోళనకు మరింత తీవ్రం చేయడంతో దిల్‌సుఖ్ నగర్‌తో పాటు ఎల్బీ నగర్‌లోనూ పోలీసులు భారీఎత్తున మోహరించారు. అశోక్ నగర్‌లో పోలీసులతో పాటు అదనపు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. నిరుద్యోగులను బలవంతంగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.