Hyderabad Women's Coach Head Coach: ఎప్పుడూ వివాదాలకు కేరాప్‌గా ఉండే హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ ఈసారి మరోవివాదంలో చిక్కుకుంది. ఈసారి ఏకంగా హెడ్‌ కోచ్‌పైనే వేటు పడింది. మద్యం మత్తులో క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్ని ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ జగన్‌మోహన్. 


హైదరాబాద్‌ మహిళా క్రికెట్‌కు హెడ్‌ కోచ్‌గా ఉన్న జైసింహా మద్యం తాగుతున్న ఓ వీడియో వైరల్‌గా మారింది. విజయవాడలో మ్యాచ్‌ ఆడి వస్తున్న టైంలో జరిగిన ఘటనపై మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. ఫుల్‌గా తాగిన ఆయన తమపట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. దురుద్దేశంతోనే ఆలస్యం చేశారని దీని కారణంగా ఫైట్ మిస్ అయినట్టు మహిళా క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. 


జైసింహా కారణంగా ఫ్లైట్ మిస్‌ అయ్యి బస్సులో రావాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక్కడే ఫుల్‌గా తాగున్న కోచ్‌ను క్రికెటర్లు వారించారట. ఆయన మాత్రం తాగుతూనే ఉన్నారు. పదే పదే చెబుతుంటే వారిపై చిందులు తొక్కారట. కోపంతో వారిని బూతులు తిట్టారని తెలుస్తోంది.


ఈ ఘటన జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న సెలక్షన్ కమిటీ మెంబర్స్‌ జైసింహకు అడ్డు చెప్పలేదు. ఆయన చేస్తున్న దానికి ఎంకరేజ్ చేస్తున్నట్టు నువ్వుతూ ఉండిపోయారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా క్రికెటర్లు హెచ్‌సీఏకు ఫిర్యాదు చేశారు. జైసింహా, సెలక్షన్ కమిటీ మెంబర్స్‌పై చర్యలకు డిమాండ్ చేశారు. 


ఈ ఫిర్యాదుతో అలర్ట్ అయిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ చర్యకు ఉపక్రమించారు. హెడ్‌ కోచ్‌గా ఉన్న జైసింహను తప్పిస్తూ చర్యలు తీసుకుంది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు తేలే వరకు పదవిలో కొనసాగవద్దని తేల్చి చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ చేసే వరకు ఆయనపై వేటు వేసినట్టు తేల్చారు.