Traffic Challan in Telangana: తెలంగాణలో పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల చెల్లింపులకు ఇచ్చిన రాయితీ ముగిసింది. గురువారం (ఫిబ్రవరి 15) అర్థరాత్రితో డిస్కైంట్‌ ఆఫర్‌ గడువు అయిపోయింది. ఈ గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించారు.  మొదట జనవరి 10వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఆ తరువాత సాంకేతిక సమస్యలు రావడంతో... జనవరి 31 వరకు గడువు పొడిగించారు. ఆ తర్వాత... మరోసారి ఫిబ్రవరి 15 వరకు గడువు పెంచారు. ఇప్పటికే రెండు సార్లు గడువు పెంచిన  అధికారులు... ఈసారి మాత్రం గడువు పొడిగించలేదు. దీంతో నిన్న (గురువారం) అర్థరాత్రితో పెండింగ్‌ చలాన్ల చెల్లింపులపై డిస్కౌంట్‌ ఆఫర్‌ ముగిసిపోయింది. ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ వల్ల ఖజానాకు 147 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు పోలీసు  అధికారులు. చాలా మంది ఈ ఆఫర్‌ను వినియోగించుకున్నారని చెప్పారు. 


తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్‌ ఆఫర్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వాహనాలను బట్టి 50 నుంచి 90 శాతం వరకు రాయితీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ద్విచక్ర వాహనాలు... బైక్‌లు, ఆటోలకు 20 శాతం చలాన్లు చెల్లిస్తే... మిగిలిన 80 శాతం రాయితీ ఇచ్చారు. తేలికపాటి, హెవీ వాహనాలు, కార్లు, జీపులు, భారీ వాహనాలకు 40శాతం చెల్లిస్తే మిగిలిన 60 శాతం మాఫీ చేశారు. అలాగే... ఆర్టీసీ డ్రైవర్లకు.. ట్రాఫిక్‌ చలాన్లలో 10శాతం చెల్లిస్తే మిగిలిన 90శాతం మాఫీ చేశారు. డిసెంబర్ 25లోపు వాహనాలపై పడిన చలాన్లకు మాత్రమే ఈ రాయితీ వర్తించింది. మొత్తంగా... డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు పెండింగ్ చలాన్లపై రాయితీతో చెల్లింపులు జరిగాయి. 


హైదరాబాద్ నగరంలోని రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్.... మూడు కమిషనరేట్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలతోపాటు అన్నీ ప్రాంతాల్లో... ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులకు చలాన్లు విధిస్తారు. సీసీ కెమెరాల ఆధారంగా... ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారు. పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయని సమాచారం. ఇందులో 80 లక్షల మందికిపైగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను జనవరి 10లోపు చెల్లించగా... ఇప్పటి వరకు కోటి 66 లక్షల పెండింగ్ చలాన్లు క్లియర్‌ అయినట్టు అధికారులు తెలిపారు. 


2022లోనూ ప్రభుత్వం ఇదే తరహా డిస్కౌంట్‌ను ప్రకటించి విజయవంతమైంది. గతేడాది మార్చి నాటికి 2.4 కోట్ల చలాన్లు పెడింగ్‌లో ఉన్నాయి. దీంతో వీటిని వసూలు చేసేందుకు ప్రభుత్వం భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ద్విచక్ర వాహానాలకు 75  శాతం, ఇతర వాహనాలకు 50 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. దీనికి వాహనదారుల నుంచి విశేష స్పందన లభించింది. పెండింగ్ చలాన్లలో 65 శాతం వసూలు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వానికి ఈ చెల్లింపుల ద్వారా 45 రోజుల్లోనే 300కోట్ల రూపాయల వరకు వసూలయ్యాయి. దీంతో ఈ ఏడాది కూడా ఇదే ప్లాన్‌ను అమలు చేసింది పోలీసు శాఖ. వాహనదారులను ఆకర్షించేందుకు ఈసారి కూడా పెండింగ్‌ చలాన్లపై డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీంతో.. ఈసారి కూడా ప్రజల నుంచి మంచి రెస్పాన్స్  వచ్చిందని అధికారులు తెలిపారు.