AUTO BUNDH: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు  ఉచిత ఆర్టీసీ( RTC) బస్సు సౌకర్యం కల్పించడంతో...రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు(AUTO) బతకులు దినదిన గండంగా గడుస్తున్నాయి. బేరాలు లేక, కిస్తీలు కట్టలేక ఆటోడ్రైవర్లు ఆగమాగమవుతున్నారు. కుటుంబ పోషణ భారమైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలంటూ  నేడు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు.


బతికేదెలా..?
రోజంతా కష్టపడితే గానీ పూటగడవని బతుకులు వారివి..పెరిగిన డీజిల్, పెట్రోలు రేట్లు, పన్నుల రేట్లకు తోడు...ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం( TG Govt) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లంతా రోడ్డునపడ్డారు. జనం రాక, బేరాలు లేక ఆటోలన్నీ స్టాండ్ లకే పరిమితమయ్యాయి. అసలే అంతంతమాత్రంగా  జీవితాలను వెల్లదీస్తున్న  ఆటోడ్రైవర్ల బతుకులపై ఉచిత బస్సు( Free Bus) ప్రయాణం మరింత దెబ్బకొట్టింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ  పలుచోట్ల నిరసనలు తెలిపిన ఆటోయూనిన్లు నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్(Bundh) కు పిలుపునిచ్చారు. లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఆటోలకు కిస్తీలు కట్టలేకపోతుంటే...మరోవైపు కుటుంబ పోషణ కూడా భారమైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మహిళలే మహరాణులు
ఆటోవాలాలకు మహిళలే మహరాణులు. ఎందుకంటే ఆటో ప్రయాణాల్లో కనీసం 60 నుంచి 70శాతం మహిళల నుంచే ఆదాయం లభిస్తుంది. ఎందుకంటే మగవారు ఎక్కడికి వెళ్లాలన్నా బైక్, కారు తీసుకుని బయటకు వెళ్లిపోతారు. అదే మహిళలు బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఆటో మాట్లాడుకోవాల్సిందే. 
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే ఎక్కువగా ఆటోల్లో ప్రయాణిస్తుంటారు. మగవాళ్లు నాలుగు అడుగులు వేస్తే వెళ్లిపోవచ్చని బయలుదేరుతుంటారు. దారిలో ఏ బైక్ వాడినో లిప్ట్ అడిగి చేరాల్సిన చోటుకు చేరిపోతుంటారు. కానీ ఆడవాళ్ల పరిస్థితి అలా కాదు. ఆటో కదిలే వారు స్టాండ్ లో వేచి చూసేది వాళ్లే. పైగా కుటుంబానికి కావాల్సిన సరుకులు అన్నీ తీసుకురావడానికి పట్నాలకు వెళ్లేది కూడా వాళ్లే. కాబట్టి తప్పనిసరిగా  వారు ఆటో లేనిదే అడుగు బయటపెట్టారు. ఇప్పుడు అలాంటి మహారాణి పోషకులకే ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించింది. దీంతో ఆటో ఎక్కే మహిళలే కరవయ్యారు. తప్పనిసరి అనుకుంటే తప్ప..బస్సులు తిరిగే మార్గంలో మహిళలు ఆటోలు ఎక్కడం మానేశారు. పైగా బస్సులు వచ్చే సమయంలోనే  తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. దీంతో ఆటోవాలాల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది.సిటీ బస్సుల్లోనూ  మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో నగరాల్లోనూ  ఆటోవాళ్లకు కిరాయిలు లేకుండా పోయాయి. ప్రభుత్వం ప్రకటించినప్పుడు  కర్ణాటకలో పరిస్థితిని ఇదేమంతా  ఆదరణ పొందే పథకం కాదులేనని ఆటోడ్రైవర్లు సర్దిచెప్పుకున్నారు. రెండు, మూడురోజుల్లో మళ్లీ పాత పరిస్థితులే వస్తాయనుకున్నారు. కానీ ప్రభుత్వం ఊహించిన దానికన్నా ఉచిత బస్సు ప్రయాణం విశేష ఆదరణ లభిస్తోంది. మహిళలు పెద్దఎత్తున ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడమే గాక...ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అటు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం సైతం..ఏదో అరకొరగా బస్సులు వేయడం కాకుండా మహిళలకు ఏమాత్రం ఇబ్బంది తలెత్తకుండా బస్సుల సంఖ్యను రద్దీనిబట్టి పెంచాలంటూ ఆదేశాలివ్వడంతో  ఈ పథకం సూపర్ హిట్ అయ్యింది. 


నిరుపేదలే ఎక్కువ
అయితే ఆటో కార్మికుల్లో ఎక్కువశాతం మంది నిరుపేదలే ఉన్నారు. కిరాయి ఇళ్లల్లో ఉంటూ కిస్తీల్లో ఆటోలు కొనుక్కుని నడుపుకుంటున్నారు. నెలమొత్తం కష్టపడి సంపాదిస్తే బండి ఈఎంఐలు, ఇంటి అద్దెలకే  సరిపోవడం లేదు. ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులవ్వడంతో...వారికి ఏం పాలుపోవడం లేదు. రెండు నెలలుగా  బండి కిస్తీలు కట్టకపోవడంతో  ఫైనాన్స్ సంస్థల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కొందరు దాదాపు 30 ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. అలాంటి వారు ఒక్కసారిగా  వేరే పనికి వెళ్లలేక...ఆటో నడుపుకోలేక సతమతమవుతున్నారు. వయసు మళ్లిన వారి పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ప్రభుత్వానికి తమ బాధలు చెప్పుకునేందుకు  నేడు రాష్ట్రవ్యాప్తంగా  ఆటోడ్రైవర్లు బంద్ కు పిలుపునిచ్చారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించనుండగా.... హైదరాబాద్‌(HYD) సుందరయ్య విజాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు.