గురువారం నాడు హైదరాబాద్ నగరంలో మరో అద్భుతం జరిగింది. కేవలం రెండు నెలల వ్యవధిలో ఇలాంటి అద్భుతం జరగడం రెండోసారి. ఇంతకీ ఏంటీ ఆ అద్భుతం అనుకుంటున్నారా? అదేనండీ గురువారం మరోసారి నీడ మాయమైంది. ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి.
గురువారం కొన్ని నిమిషాల పాటు హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో వారి నీడ వారికి కనిపించలేదు. మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు నీడ మాయం అయ్యింది. దీన్ని జీరో షాడో డే అంటారు.
సుమారు రెండు నిమిషాల పాటు నీడ కనిపించకుండా పోయింది. సూర్యకిరణాలు వస్తువు, మనిషి పై నిట్టనిలువుగా పడటం వల్ల వాటి నీడ మాయమైనట్లు కనిపిస్తుంది.
ఈ ఏడాది కర్ణాటక తో పాటు హైదరాబాద్ లో జీరో షాడో డే ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం హైదరాబాద్ లో మే 9 న మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12.14 అంటే సుమారు రెండు నిమిషాల పాటు నీడ మాయమైంది.
ఆ సమయంలో అనేక మంది రోడ్ల మీదకు వచ్చి.. తమ నీడను పరీక్షించుకున్నారు కూడా. ఇప్పుడు మరోసారి గురువారం నాడు నీడ మాయం కావడంతో మరోసారి ఆసక్తికరంగా నీడ మాయమవడాన్ని తిలకించారు.
చాలా మంది నగర వాసులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో నీడ మాయమైన వీడియోలను చిత్రాలను పోస్ట్ చేశారు.