Hyderabad News: హైదరాబాద్ లో ఈరోజు కురిసిన అకాల వర్షానికి పెద్ద ఎత్తున వరద నీరుతో రోడ్లు జలాశయాల్లా కనిపించాయి. ముఖ్యంగా సికింద్రాబాద్ కళాసిగూడ నాలాలో పడి పదకొండేళ్ల బాలిక మృతి చెందడం తెలిసిందే. అయితే ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు... నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై వేటు వేశారు. ఏఈ తిరుమలయ్య, వర్క్ ఇన్ స్పెక్టర్ బీఎం హరికృష్ణను సస్పెండ్ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పది రోజుల్లో సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఈఈ ఇందిరా బాయికి ఆదేశాలు జారీ చేశారు. 


అసలేం జరిగిందంటే..? 
సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో దారుణం జరిగింది. 11 ఏళ్ల వయసున్న మౌనిక అనే బాలిక ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. అయితే శనివారం ఉదయం భారీ ఎత్తున వర్షాలు కురవగా... అదే సమయంలో బాలిక పాలు తీసుకొచ్చేందుకు బయటకు వచ్చింది. అయితే పెద్ద ఎత్తున వరదలు వస్తున్నా అందులోంచే నడుచుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో నాలాలో కొట్టుకుపోయిన మౌనిక పార్క్‌లైన్‌ వద్ద శవమై తేలింది. విషయం గుర్తించిన స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సందర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


అయితే ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదంతా జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి పరిస్థితి ఇలా ఉంటే... తరువాత వర్షా కాలంలో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.