తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ రహదారిపై వెళ్తున్న సమయంలో అడ్డుగా వచ్చిన ఓ మహిళపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ విధులకు ఆటంకం కలిగించారనే నేరంపై ఆమెపై ఈ కేసు పెట్టారు. పంజాగుట్ట పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉంది. తెలంగాణ సమైక్యత దిన వేడుకల్లో భాగంగా ఆ సభలో పాల్గొన్న ఆ తర్వాత సాయంత్రం సమయంలో రాజ్‌ భవన్‌ రహదారిలో కాన్వాయ్‌తో ప్రగతి భవన్‌కు వెళ్లారు. 


సాధారణంగా సీఎం కాన్వాయ్ మూమెంట్ ఉంటే సాధారణ ప్రయాణికులను ఆ మార్గాల్లోకి అనుమతించరు. కనీసం 5 నిమిషాల ముందే ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనదారులను నిలిపివేస్తుంటారు. అప్పుడు కూడా కేసీఆర్ కాన్వాయ్ రానున్న రాజ్ భవన్ రోడ్డులో ట్రాఫిక్‌ పోలీసులు ప్రధాన రహదారిపైకి వచ్చే వాహనాలను నిలిపి వేశారు. రాజ్‌ భవన్‌ రోడ్‌ లక్కీ రెస్టారెంట్‌ వద్ద ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ బి.రాజు విధుల్లో ఉన్నారు. సీఎం కాన్వాయ్‌ వస్తోందని రెస్టారెంట్‌ మార్గంలో ఓ బెంజ్‌ కారును ఆపారు. 


అయితే, ఆ కారులో నుంచి దిగి బయటికి వచ్చిన ఓ మహిళ తమను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించింది. తాము అత్యవసరంగా వెళ్లాలని విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగింది. అయినా ట్రాఫిక్ కానిస్టేబుల్ మాటలు ఆమె వినలేదు. మెయిన్ రోడ్డుపైకి నడుచుకుంటూనే వస్తుండగా, వీవీఐపీ మూమెంట్ ఉందని, అక్కడికి వెళ్లొద్దని కానిస్టేబుల్‌ వారించారు. అక్కడికి చేరుకున్న పంజాగుట్ట పెట్రోలింగ్‌ పోలీసులు ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆగలేదు. 


ఆ మరుసటి రోజు ఈ విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారి ఆదేశాల మేరకు సదరు మహిళపై పంజాగుట్ట పీఎస్‌లో కానిస్టేబుల్‌ రాజు ఫిర్యాదు చేశారు. తనను అసభ్య పదజాలంతో ఆ మహిళ దూషించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ప్రదేశంలో జరిగిన ఘటన అంతా తన సెల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశానని చెప్పాడు. కానిస్టేబుల్ రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.