ఇండిగో విమాన సంస్థకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ హితవు పలికారు. దయచేసి స్థానిక భాషలను గౌరవించాలని ఇండిగో సంస్థను కోరారు. ఇండిగో విమానంలో ఓ తెలుగు మహిళకు ఎదురైన వివక్షాపూరిత అనుభం దృష్ట్యా మంత్రి ఈ సూచనలు చేశారు. దీనికి సంబంధించి ఇండిగోను ట్యాగ్ చేస్తూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న 6E 7297 ఇండిగో విమానంలో ఓ మహిళ కూడా ఎక్కారు. ఆమెకు తెలుగు మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నారు. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. దీంతో ఆమెను తన సీటు నుంచి లేపి విమాన సిబ్బంది మరో సీటులో కూర్చోబెట్టారు. 


ఈ విషయాన్ని గుర్తించిన అదే విమానంలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికురాలు, ఐఐఎం అహ్మదాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవాస్మిత చక్రవర్తి అనే మహిళ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. సెప్టెంబరు 16న ఈ ఘటన జరిగింది. విమానంలోని ఓ ఫోటోను ట్వీట్ చేస్తూ గ్రీన్ కలర్ చీర కట్టుకున్న మహిళ ఒరిజినల్ సీట్ నెంబరు 2A (XL సీట్, exit row). కానీ, ఆమెను అక్కడి నుంచి లేపి 3C లో కూర్చొబెట్టారు. ఎందుకంటే ఆమెకు తెలుగు మాత్రమే వచ్చు. ఇంగ్లీష్, హిందీ రాదు. విమాన సిబ్బందిని అడిగితే అది సెక్యురిటీ ఇష్యూ అని చెప్పారు. అంటూ ఇండిగో విమాన సంస్థను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.






 


స్పందించిన కేటీఆర్
‘‘డియర్ ఇండిగో మేనేజ్మెంట్. ఇండియన్ స్థానిక భాషలను, అవి మాట్లాడే ప్రయాణికులను గౌరవించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. హిందీ, ఇంగ్లీష్ మాట్లాడలేని వారికి కూడా మర్యాదగా ఉండాలి. ప్రాంతీయ నగరాల మధ్య నడుపుతున్న విమాన సర్వీసుల్లో సిబ్బందిని స్థానిక భాషలు మాట్లాడే వారిని నియమించుకోండి. తెలుగు, తమిళ, కన్నడ మాట్లాడగలిగే సిబ్బందిని ఆయా నగరాల మధ్య నడిచే విమానాల్లో రిక్రూట్ చేసుకోండి’’ అని కేటీఆర్ కోరారు.