Hyderabad Traffic: హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈరోజు కూడా జోరుమీదున్న వర్షాన్ని చూస్తుంటే ఏమాత్రం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. భారీ వర్షాల వల్ల సాధారణ జీవితం ప్రభావితమైంది. భాగ్యనగరంలోని చాలా ప్రాంతాలు నీటితో నిండిపోగా.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, కోఠి, దిల్ సుఖ్ నగర్, చార్మినార్, మలక్ పేట, ఎల్బీ నగర్, ఉప్పల్, బేగంపేట, నారాయణగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకపూల్ వంటి ప్రాంతాల్లోని రహదారులపై నీరు నిలిచిపోగా.. రద్దీ మరింత పెరిగింది. రోడ్లపై నిలిచిన నీటిని తరలించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న రోడ్డుతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. అయితే ఇక్కడ నిలిచిన నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది నీరును ఎంత తీసేస్తున్నా వర్షం ఎక్కువగా పడుతుండడంతో ఏం చేయలేకపోతున్నారు. వర్షంతో పలు చోట్ల చెట్లు విరుగి పడ్డాయి. దీంతో విద్యుత్ కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నగరంలో నీటమునిగిన రోడ్ల చిత్రాలతో కూడిన ట్వీట్‌ను షేర్ చేస్తూ హైదరాబాద్ యూ డిజర్వ్ అనే ట్విట్టర్ ఖాతాలో రోడ్ల పరిస్థితిపై అధికారులను దుయ్యబట్టారు. నేను హైదరాబాదీ ఇది మా వాటర్ వరల్డ్ అంటూ రాసుకొచ్చారు.
భారీ వర్షాలు కురుస్తుండడంతో నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్టీఎంలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉన్న వారిని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని నగర వాసులకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే హెల్ప్ లైన్ నెంబర్ 0404 29555500, 040 21111111 కు ఫోన్ చేయాలని సూచించారు.