School Holidays: రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజే (జూలై 20) తెలంగాణ సర్కారు వర్షాల నేపథ్యంలో విద్యాలయాలకు రెండు రోజులు సెలవులు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే, పిల్లలు బడికి వెళ్లకముందే ఈ సెలవులు ప్రకటిస్తే బాగుండేది. కానీ పిల్లలంతా బడికి వెళ్లిపోయాక సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతటి వర్షంలోనూ చాలా మంది పిల్లలు బడికి వెళ్లారు. మళ్లీ అదే వర్షంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. 






రెండ్రోజుల క్రితమే వాతావరణ శాఖ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసినా విద్యాశాఖ అధికారులు మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినా కూడా పట్టించుకోకుండా తీరిగ్గా స్పందించిందంటూ అవాకులు చవాకులు పేలుస్తున్నారు. విద్యార్థులు బడికి వెళ్లిన తర్వాత బడులకు సెలవుల ప్రకటన చేయడం సరికాదని అంటున్నారు. రెండు రోజుల క్రితమే ఈ ప్రకటన చేయాల్సిందని వివరిస్తున్నారు. 






రేవతి అనే ఓ నెటిజెన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తన కూతురుకు ఆరోగ్యం బాగాలేకపోయినా పరీక్ష ఉందని.. భారీ వర్షంలోనూ బడికి వెళ్లిందని చెప్పారు. 7.30 గంటలకు పాప బస్సులో వెళ్లిపోయిందని 8.15కి పాఠశాల కూడా ప్రారంభం అయిందని వివరించింది. కానీ ఉదయం 8:18 గంటలకు విద్యాశాఖ మంత్రి రెండు రోజులు సెలవులు ప్రకటించారని చెప్పారు. వాతావరణ శాఖ రెండు రోజుల క్రితం నగరంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిందని గుర్తు చేశారు. 






అలాగే జేపీఆర్ యువగళం అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి జైపాల్ రెడ్డి అనే నెటిజన్ కూడా విద్యాశాఖ మంత్రిపై ఫైర్ అయ్యారు. "అందరి పిల్లలు పొద్దున్నే స్కూల్ కు వెళ్లిన తర్వాత తీరిగ్గా నిద్ర లేచి విద్యాలయాలకు సెలవులు అంటూ ప్రకటన చేసిన విద్యాశాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు" అని తెలిపారు.