Hyderabad Traffic Fines Increased: ఇప్పటికే ఇంధన ధరలు, నిత్యావసర సరుకుల ధరలతో సతమతం అవుతున్న వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పిడుగుల లాంటి వార్త చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికి భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే సవరించిన జరిమానాల వివరాలు వెల్లడించారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపేవారికి రూ.1700 జరిమానా విధించాలని నిర్ణయించారు. అదే విధంగా ట్రిపుల్ రైడింగ్ (టూ వీలర్ పై) వెళ్తున్నట్లయితే మీకు రూ.1200 జరిమానా విధించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.నవంబర్ 28 నుంచి రాంగ్ సైడ్, ట్రిపుల్ డ్రైవింగ్‌పై వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.
ఇటీవల ఆపరేషన్ రోప్ చేపట్టిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహనా పెంచుతున్నారు. తాజాగా రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. జరిమానాల (Traffic Rules In Hyderabad)ను పెంచుతూ ప్రమాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక నుంచి రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తే రూ.1700 జరిమానా విధిస్తారు. ట్రిపుల్ రైడింగ్ అయితే రూ.1200 జరిమానా చెల్లించక తప్పదని ట్రాఫిక్ పోలీసులు తాజాగా ట్వీట్టర్ లో వెల్లడించారు.
హైదరాబాద్‌లో 2020తో పోల్చితే గత ఏడాది రాంగ్ రూట్ డ్రైవింగ్ మరణాలు పెరగగా.. ట్రిపుల్ రైడింగ్ కేసులు తగ్గాయి. రాంగ్ రూట్‌లో వెళ్లటం, ట్రిపుల్ రైడింగ్ చేయటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 2020లో రాంగ్ రూట్‌లో వెళ్తూ 15 మంది చనిపోగా, 2021లో ఆ సంఖ్య 21కు పెరిగింది. 2020లో ట్రిపుల్ రైడింగ్ కారణంగా 24 మంది చనిపోతే, గత ఏడాది ఆ సంఖ్య 15కి దిగొచ్చినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేకు ట్విట్టర్ ద్వారా గణాంకాలు వెల్లడించారు.
ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 15 మంది చనిపోగా, ట్రిపుల్ రైడింగ్ ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలను, మరణాలను పూర్తిగా తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సర్కిల్స్ వద్ద స్టాప్ లైన్ దాటితే రూ.100 ఫైన్, ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేస్తే రూ.1000 జరిమానా, పాదచారులకు అడ్డుగా వాహనాలు నిలిపితే రూ.600 జరిమానా విధిస్తున్నారు. అయితే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ రోప్’ విజయవంతం కావడం, ప్రమాదాలను నివారించేందుకుగానూ ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు.