TSRTC : యాంత్రిక జీవనంలో ప్రతి ఒక్కరూ సరైన జీవన ప్రమాణాలు పాటించి ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం. ఆరోగ్యమైన జీవన వికాసం కొనసాగించినట్లయితే అటు వ్యక్తిగత, ఇటు ఉద్యోగ జీవితాల్లోనూ మంచి ఫలితాలు వస్తాయి.  అందుకోసం సంస్థ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రాండ్ హెల్త్ ఫిట్నెస్ ఛాలెంజ్ పేరిట నవంబరు మాసంలో ప్రత్యేకంగా హెల్త్ డ్రైవ్ కార్యక్రమాన్ని టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో హెల్త్ ఛాలెంజ్ ను అన్ని డిపోలు, యూనిట్లలో నిర్వహించి ఆరోగ్య సమస్యలపై మార్గనిర్దేశం చేశారు. బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఆరోగ్య సంక్షేమంలో భాగంగా ఈ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. 4898 మంది మహిళా ఉద్యోగినీలతో సహా 50 వేల మందికి పైగా ఉన్న సిబ్బందికి వైద్య పరీక్షల నిర్వహణ కోసం అన్ని రీజియన్లలో 25 వైద్య బృందాలు పాల్గొని సేవలు అందించనున్నాయని చెప్పారు. 


ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు 


టీఎస్ఆర్టీసీ సంస్థలో ఇప్పటి వరకు 20,000 మంది ఉద్యోగుల ఆరోగ్య పరీక్షల వివరాలను సేకరించామని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. వందమంది ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల వల్ల వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రిలో చేర్చామన్నారు. ఎవరైతే ఆరోగ్య పరీక్షల్లో ఎమర్జెన్సీ లక్షణాలు కనిపిస్తే తక్షణమే డాక్టర్ల సూచన మేరకు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స కోసం చేర్చుతున్నామని వెల్లడించారు. సంస్థ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా తార్నాక ఆసుపత్రిలో వైద్య సేవల కోసం వివిధ జిల్లాల నుంచి వస్తు ఉంటారని, వారికోసం వైద్య పరీక్షలతో పాటు మెరుగైన చికిత్స అవసరమైన మందులు ఉచితంగా అందజేస్తున్నామని బాజిరెడ్డి తెలిపారు. తార్నాక ఆసుపత్రిలో 24 గంటల ఫార్మసీ, డయాగ్నస్టిక్ సేవలు కార్డియాలజీ, నేఫ్రాలజీ, గైనిక్ సేవల కోసం పూర్తిస్థాయి సిబ్బంది పనిచేస్తుందని చెప్పారు. ఈసీజీ, ఐసీయూ సేవలు అందుబాటులోకి రావడంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రైవేటు ఆసుపత్రులను  కాకుండా నిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామన్నారు. 


మానసిక స్థితిగతులే కారణం 


తార్నాక ఆసుపత్రిలో గతంతో పోలిస్తే వైద్యం కోసం వచ్చే ఉద్యోగులు, ఔట్ పేషెంట్స్ పెరుగుతున్నారని ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు. తార్నాక ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు, పరీక్షలు అందుబాటులో ఉన్నాయని ఇంకా ఇక్కడ లేని సౌకర్యాల కోసం అవసరం నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామన్నారు.  మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే వాస్తవాన్ని మరవకూడదని, నిత్య జీవితంలో వచ్చే అనేక రుగ్మతలకు మానసిక స్థితిగతులే కారణమన్నారు. సీఎం కేసీఆర్  సహకారంతో ప్రతి ఆర్టీసీ ఉద్యోగిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. టీఎస్ఆర్టీసీ సంస్థ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల వైద్య సౌకర్యాలు సంస్థ కల్పిస్తుందని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు.