National Amateur Golf League: జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ ఘనంగా ముగిసింది. ఈ ఏడాది లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో లక్నో 3-2 స్కోర్ తో టీమ్ మైసాపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో గోల్ఫర్స్ గిల్డ్ 3-2 తేడాతో నానో ఫ్లిక్స్ టీమ్ పై గెలిచింది. పురస్కారాల ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ , మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ , అతిథిలుగా అంతర్జాతీయ గోల్ఫర్లు టీసా మాలిక్ , ప్రితిమా దిలావరి హాజరయ్యారు. 


విజేతలకు కపిల్ దేవ్  ట్రోఫీలు అందజేశారు. విజేతగా నిలిచిన లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ జట్టుకు 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీని , టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి అందజేశారు. రన్నరప్ జట్టు టీమ్ మైసాకు 3 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన గోల్ఫర్స్ గిల్డ్ జట్టుకు 2 లక్షల ప్రైజ్ మనీ అందించారు. విజేతలను కపిల్ దేవ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ టోర్నీ విజయవంతంగా నిర్వహిస్తున్న టీ గోల్ఫ్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డిని కపిల్ దేవ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. కాగా వచ్చే సీజన్ నుంచి మరిన్ని జట్లతో లీగ్ ను నిర్వహిస్తామని డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి చెప్పారు. దేశంలో యువ గోల్ఫర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ గోల్ఫ్ ఫౌండేషన్ తరపున భవిష్యత్తులో అకాడమీని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.




దేశంలో గోల్ఫ్ కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు టీ గోల్ఫ్ ఫౌండేషన్ నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగును ఆరంభించింది. గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ వేదికగా 5 రోజుల పాటు పోటీలు జరిగాయి. గత ఏడాది జరిగిన తొలి సీజన్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సారి సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ మైసాతో పాటు మైటీ ఈగల్స్ ( బెంగళూరు) , కానమ్ ర్యాప్టర్స్ ( ఛండీగఢ్), చెన్నై హస్లర్స్ ( చెన్నై), గోల్ఫర్స్ గిల్డ్ ( ఢిల్లీ ), నానో ఫిక్స్ క్లీన్ టెక్ ( కోల్ కతా), దబాంగ్ డేర్ డెవిల్స్ ( లక్నో ), శ్రీనిధియన్ థండర్ బోల్ట్స్ ( హైదరాబాద్ ) టీమ్స్ తలపడ్డాయి. 


ఈ లీగ్  సింగిల్స్, ఫోర్ బాల్ బెటర్ బాల్ మ్యాచ్ ప్లే ఫార్మాట్ లో జరిగింది. మొత్తం 8 జట్లను డ్రా పద్ధతిలో రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టూ మిగిలిన జట్లతో ఒక మ్యాచ్ ఆడింది. ఈ రెండు గ్రూపుల్లో టాప్ లో నిలిచిన 2 జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి.