Hyderabad Traffic Diversion | హైదరాబాద్: కంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహించే ఎయిర్ షో (Air Show)కు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశముందని, వారికి ఏ ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్బంగా ఆదివారం నాడు (డిసెంబర్ 8న) వైమానిక ప్రదర్శన, డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ప్రపంచంలోని టాప్ టీమ్‌తో ఎయిర్ షో
ఈ సందర్బంగా తెలంగాణ సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. భారతీయ వైమానిక దళం (IAF) ఏర్పాటు చేస్తున్న ఎయిర్ షోలో 9 సూర్యకిరణ్ విమానాలు పాల్గొంటాయని తెలిపారు. ఈ రకమైన విన్యాసం చేయగల సత్తా ప్రపంచంలో కేవలం 5 టీంలకు మాత్రమే ఉందన్నారు. కాగా, అందులో ఒక టీమ్ హైదరాబాద్ లో విన్యాసాలు చేయడం రాష్ట్రానికే గర్వ కారణం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, రాష్ట్ర మంత్రులు, వీవీఐపీలు, ఐఏఎఫ్‌నకు చెందిన సీనియర్ అధికారులు ఈ ఎయిర్ షో వీక్షించడానికి హాజరవుతారు. కనుక విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.
ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎయిర్ షో లో సూర్యకిరణ్ కు చెందిన విమానాలు పాల్గొంటాయి. ఈ షోతో పాటు సాయంత్రం నిర్వహించే మ్యూజికల్ కాన్సర్ట్ కు నక్లెస్ రోడ్ (Necklace Road), పీవీ మార్గ్ లలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కానున్నారు. వీరి సౌకర్యార్థం ఇప్పటికే ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఎయిర్ షో అనంతరం రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) మ్యూజికల్ కాన్సర్ట్ కార్యక్రమానికి సైతం ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది. వారికి తగిన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.
Also Read: KTR News: కేటీఆర్‌ను కలిసిన లగచర్ల భూసేకరణ బాధితులు, వెంటనే ఎస్పీకి ఫోన్ కొట్టిన బీఆర్ఎస్ నేత
2 గంటలపాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్‌పై ఆదివారం భారీ ఎయిర్ షో నిర్వహించనున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ ఎయిర్‌షో నిర్వహించనున్నారు. ఎయిర్ షోలో భాగంగా వాయుసేన (IAF) విమానాలు అద్భుత విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు గంటలపాటు ట్యాంక్‌బండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు రోజు డిసెంబర్ 9న సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి దాదాపు లక్ష మంది మహిళలు పాల్గొంటారని, ఇందుకు ఏర్పాట్లు చేయాలని సి.ఎస్ అధికారుకు సూచించారు. విగ్రహం ఆవిష్కరణ సందర్బంగా దాదాపు 150 మంది ప్రముఖులు కూర్చునేలా ప్రధాన వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో వేదిక ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే స్వయం సహాయ బృందాలు మహిళలు, ఇతరులందరూ మధ్యాహ్నం 4.30 లోగా సభా ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు.