తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై టిపిసిసి జనరల్ సెక్రటరీ ఫిరోజ్ ఖాన్ ఏబీపీ దేశంతో ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


ABP దేశం: ఏడాది పాలనలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏం సాధించింది..?


ఫిరోజ్ ఖాన్: ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల రైతులకు 21,000 కోట్ల రుపాయల రుణమాఫీ చేసింది. యువతకు 50వేల ఉద్యోగాలు ఇచ్చాము. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆరోగ్య శ్రీ.. ఇలా అన్ని పథకాలు ఏడాదిగా రేవంత్ రెడ్డి సీఎంగా అమలు చేస్తున్నారు. ఎక్కడా ప్రజలకు తక్కువ చేసింది లేదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం బంగారు  తెలంగాణ అని చిప్ప తెలంగాణ చేసింది. ఏకంగా 7 లక్షల కోట్ల అప్పులతో మాకు అధికారం ఇచ్చారు. అప్పులు ఉన్నా మేము ఎక్కడా స్కీములు ఆపలేదు. మహిళలకు ఉచిత బస్సులు తిప్పుతున్నాం. వంట గ్యాస్ లో సబ్సిడీ ఇస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మొదలు పెట్టాం. హైడ్రా (HYDRA) అనే గొప్ప విజనరీ ప్రోగ్రాం తీసుకొచ్చాం. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు 21 టిఎంసీల గోదావరి నీటిని హైదరాబాద్ కు తెస్తున్నాం. సౌత్ ఇండియాలోనే అతి పెద్ద స్పోర్ట్స్ యూనివర్సిటీ కడుతున్నాం. స్కిల్ యూనివర్సిటీ కడుతున్నాం. ప్రతీ ఓక్క ప్రోగ్రాం అమలు చేస్తున్నాం. ఖజానాలో డబ్బులు లేకపోయినా మా విజనరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. 


ABP దేశం: హైడ్రా మొదలు పెట్టిన మీ విజనరీ ఎందుకు ఆగిపోయింది. డబ్బుల కోసమే హైడ్రా ఆపేశారనే విమర్శలకు మీ సమాధానం ఏంటి..?


ఫిరోజ్ ఖాన్: హైడ్రా పేరుతో పేదవాడికి అన్యాయం చేయం. ఇష్టానుసారం చెరువులను కబ్జాచేసి, నిర్మాణాలు చేపట్టారు. ఆక్రమణల ప్రభావంతో వర్షం పడితే హైదరబాద్ లో వరద భయం వెంటాడుతోంది. చెరువులు ఎవరి సొత్తూ కాదు, ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకోము. చెరువులను రక్షించడంలో తప్పేముంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికీ భయపడి హైడ్రాను ఆపలేదు. బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఎవరు చెరువులను ఆక్రమించుకున్నా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. సర్వే చేస్తున్నాం. కొంత సమయం తరువాత తిరిగి హైడ్రా యాక్షన్ లోకి దిగుతుంది. 


ABP దేశం: వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ప్రతిపక్షాలు మాత్రం పూర్తి స్దాయిలో రుణమాఫీ చేయలేదంటూ సవాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందా..?


ఫిరోజ్ ఖాన్: బిఆర్ఎస్, బిజెపికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. కొన్ని సాంకేతిక సమస్యల వల్లనే కొందరు రైతులకు రుణమాఫీ ఆగింది. మిగతా రైతులకు రుణమాఫీ ఇచ్చిన మాటప్రకారం చేశాం. 25లక్షల మంది రైతులకు 21 వేల కోట్లు రుణమాఫీ చేయామని మీ ఛానల్ సాక్షిగా చెబుతున్నాను. మరో నెల రోజుల్లో సాంకేతిక సమస్యలు కూడా పరిష్కరించి మిగతా రైతులకు కూడా రుణమాపీ పూర్తి చేస్తాం.



ABP దేశం: బిఆర్ఎస్ నేతల గొంతు నొక్కేందుకే కేసులు పెడుతున్నారా? ఇటీవల ప్రతిపక్ష నేతలపై కేసుల వెనుక కాంగ్రెస్ కక్ష సాధింపు అనే విమర్శలపై మీరేమంటారు?


ఫిరోజ్ ఖాన్: కేసులు పెట్టడం సర్వసాధారణం. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టారు. కనీసం మమ్మల్ని ధర్నా చౌక్ వద్దకు కూడా రానివ్వలేదు. కోర్టుకు వెళ్లిఅనుమతులు తీసుకుని మేము ధర్నాలు చేయాల్సిన పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉండేవి. కేసులు లా అండ్ ఆర్డర్ పోలీసులే చూసుకుంటారు. హరీష్ రావు, కేటీఆర్ పై కేసులు పెట్టమని రేవంత్ రెడ్డి చెప్పరు కదా. 



ABP దేశం: హైడ్రా నుండి మూసీ వరకూ సున్నితమైన అంశాలపై, సమస్యాత్మక నిర్ణయాలు తీసుకుంటూ రేవంత్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకత పెంచుకుంటున్నారా ?


ఫిరోజ్ ఖాన్: మూసీ, హైడ్రాపై మా కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు. అందుకే బిఆర్ఎస్, బీజేపీ ఎదుర్కోలేకపోతున్నాం. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రతిపక్షపార్టీలకు తగిన సమాధానం చెప్పగలుగుతాం. ట్విన్ సిటీలు అభివృద్ధి చేస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. 


కాంగ్రెస్ పార్టీకి హైడ్రాను అడ్డుపెట్టుకుని డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. అలా సంపాదింలాని అనుకుంటే మరో మార్గంలో వెళ్లే వాళ్లం. కానీ కాంగ్రెస్ ఎప్పుడూ డబ్బుకోసం ప్రజలను దోచుకోదు. నేను వారి విమర్శలతో ఏకీభవించను. అభివృద్ధి చేసి ఖజానాను నింపుతాం. అడ్డదారిలో వెళ్లాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. 


Also Read: Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్‌, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!