Telangana Govt invites KCR for unveiling of Telangana Tallis statue | సిద్దిపేట: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR)ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.
ఎర్రవెల్లి ఫాం హౌస్‌కు వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఇదే అంశంపై మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించడానికి మంత్రి, నేతల బృందం శనివారం నాడు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లింది. మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు వంశీధర్ రావు తదితరులు సాదర స్వాగతం పలికారు. తన నివాసానికి (Erravelli Farmhouse) వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి లంచ్ ఆతిథ్యమిచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గౌరవించారు.
ఉద్యమం జరిగిన రోజులు గుర్తుచేసుకున్న నేతలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను అప్పటి ఎంపీలు పొన్నం ప్రభాకర్, కేసీఆర్ నెమరు వేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా, కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారని తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రోటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులు ఉన్నారు.
Also Read: Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీలక గుర్తింపు
రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణలో వరుసగా రెండు పర్యాయాలు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చింది. మూడో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ రెండు పార్టీలకు తెలంగాణలో ఓ విశిష్టత, ప్రాముఖ్యత ఉన్నాయి. తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు సైతం గౌరవం దక్కింది. ఏపీలో తమకు నష్టం జరుగుతుందని తెలిసినా, ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణలో పరిస్థితులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాలు ఏకమై ఉద్యమించడంతో అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
మూడు రోజులపాటు ఘనంగా ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 7, 8, 9 తేదీలతో ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్న ప్రకటన వచ్చిన డిసెంబర్ 9న ప్రజా పాలన విజయోత్సవాలను ఘనంగా ముగించనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ క్రమంలో డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది. తెలంగాణ తల్లి రూపం మార్చడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.