Tesla Hyderabad Showroom:ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న టెస్లా తన అడుగులను హైదరాబాద్ వైపు వేగంగా వేస్తోంది. మే 22 శుక్రవారం నాడు టెస్లా ఇండియా ప్రతినిధులు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్ వేదికగా టెస్లా తన సేల్స్, సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించాలనే బలమైన ఆకాంక్షను వ్యక్తం చేసింది.
హైదరాబాద్ నగరాన్ని తన తదుపరి విస్తరణ గమ్యస్థానంగా టెస్లా ఎంచుకుంది. ఈ సమావేశంలో టెస్లా ప్రతినిధులు నగరంలో అత్యాధునిక షోరూమ్, సేల్స్ సెంటర్, సర్వీస్ మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రితో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యల ప్రకారం, తెలంగాణలో ఉన్న టెక్నాలజీ ఎకో సిస్టమ్ టెస్లా దీర్ఘకాలిక ఆవిష్కరణ లక్ష్యాలకు సరిగా సరిపోతుంది. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కలిగి ఉంది. ఐటీ రంగంలో హైదరాబాద్ ఎదుగుదల, టెస్లా వంటి టెక్ డ్రివెన్ కార్లకు సరైన మార్కెట్‌ను అందిస్తుంది. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారం కంపెనీని ఆకర్షించింది.
ప్రారంభం ఎప్పుడు
అధికారికంగా తేదీలు ప్రకటించనప్పటికీ ఈ సమావేశం ప్రాథమిక చర్చల దశను దాటి అమలు దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వం, టెస్లా ప్రతినిధుల మధ్య సమన్వయం వేగవంతం కావడంతో అతి త్వరలోనే షోరూమ్ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
టెస్లా రాకతో కలిగే ప్రయోజనం ఏంటీ
టెస్లా రాక కేవలం ఒక కారు షోరూమ్ ప్రారంభానికి పరిమితం కాదు. టెస్లా తన అనుబంధ పరిశ్రమలను కూడా తెలంగాణలో విస్తరించేలా చూడాలని మంత్రి శ్రీధర్ బాబు కంపెనీని కోరారు. దీని వల్ల స్థానికంగా వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాట కేవలం నాలుగు శాతం మాత్రమే. టెస్లా వంటి బ్రాండ్ ప్రవేశంతో ఈ మార్కెట్ ఊహించని రీతిలో వృద్ధి చెందుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఈవీ రంగంలో దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఏకంగా 91వేల ఈవీ రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి.
మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన హామీలు, టెస్లా ప్రతినిధుల ఆసక్తి చూస్తుంటే హైదరాబాద్ వీధుల్లో టెస్లా కార్ల హంగామా మొదలయ్యే రోజు దగ్గరలోనే ఉందని అర్థమవుతుంది.
