Heatwave deaths Telangana AP:తెలుగు రాష్ట్రాల్లో సూరీడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. ఈ దెబ్బకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గత 24 గంటల్లోనే వడదెబ్బ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఎన్నడూ లేని విధంగా మే నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో సూరీ ఊచకోత
ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఒక్క రోజు వడబెద్దకు 21 మంది మరణించారు. ఇందులో అత్యధికంగా విజయవాడలోనే ఉన్నారు. ఇక్కడ పది మంది మరణించారు. మృతుల్లో ఎనిమిది మంది యాచచకులే. రోడ్డు పక్కన, పార్కుల వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏలూరులో ముగ్గురు, కాకినాడలో ముగ్గురు, పల్నాడులో ఇద్దరు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
తెలంగాణ నిప్పుల కొలిమి
తెలంగాణలో ఎండల తీవ్రత మరింత భీకరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వడ దెబ్బతో 34మంది మరణించినట్టు తెలుస్తోంది. దాదాపు ఇరవైకిపైగా జిల్లాల్లో 46 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కుమురం భీం ఆసీఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి)లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
ఎందుకు ఈ పరిస్థితి
ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఎండలు కేవలం వేసవి ప్రభావం మాత్రమే కాదు. హిందూ మహాసముద్రంలో వేడి పెరగడం వల్ల ఏర్పడే ఎల్‌నినో ప్రభావంతో వడగాలుల సంఖ్య, వాటి వ్యవధి పెరుగుతోంది. నగరాల్లో కాంక్రీట్ కట్టడాలు, వాహనాల వినియోగం వల్ల వేడి గాలి బయటకు వెళ్లకుండా అక్కడే నిలిచిపోతోంది. ఫలితంగా నగరాల్లో ఉష్ణోగ్రతలు గ్రామీణ ప్రాంతాల కంటే రెండు నుంచి పది డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి.
మీ గుండె భద్రం
రాజస్థాన్, పంజాబ్ ఎడారి ప్రాంతాల నుంచి వీస్తున్న పొడి వేడి గాలుల మధ్య భారతంతోపాటు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా రాత్రి పూట చల్లబడాల్సిన వాతావరణం, ప్రస్తుతం 24-30 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు అవుతోంది. ఇది మానవుల గుండపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది.
మరో నాలుగు రోజులు ఇదే తంతు
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకం. అందుకే తెలంగాణలోని 18 జిల్లాలు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శని, ఆదివారాల్లో కూడా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు.
ఎండల వల్ల కేవలం ప్రాణ నష్టమే కాదు ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రతకు రోడ్డుపై వెళ్తున్న స్కూటీ మంటల్లో చిక్కుకుంది. జనగామా జిల్లాలో ఎండల వల్ల పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. ధాన్యం కుప్పలు బూడిద అయ్యాయి. ఎండల వల్ల ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో గ్రిడ్ డిమాండ్ రికార్డు స్థాయిలో 15, 016 మెగావాట్లకు చేరింది.
ప్రకృతి వైపరిత్యాలు మన చేతల్లో లేకపోయినా, అప్రమత్తతతో ప్రాణనష్టాన్ని తగ్గించవ చ్చు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, వృద్ధులు ఈ ఎండల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
