Petrol Price Hike May 2026: దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది. మే నెలలో సామాన్యుడిపై మరోసారి భారం పడింది. శనివారం (మే 23, 2026) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. గత పది రోజుల్లోనే ధరలు పెరగడం ఇది మూడోసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు పుల్‌స్టాప్ పడలేదని ఇలా పెట్రోల్ ధరలు పెంచుతున్నారు.  

Continues below advertisement

నేటి తాజా ధరలు ఇవే 

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు, డీజిల్ ధర 91 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 98.64 నుంచి రూ. 99.51కి, డీజిల్ ధర రూ.91.58 నుంచి రూ. 92.49కి చేరింది.

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటరుకు):

హైదరాబాద్‌: పెట్రోల్ రూ. 111.88 (+0.87), డీజిల్ రూ. 99.95 (+0.91).

Continues below advertisement

ముంబై: పెట్రోల్ రూ. 108.49 (+0.87), డీజిల్ రూ. 95.02 (+0.91).

కోల్‌కతా: పెట్రోల్ రూ. 110.64 (+0.87), డీజిల్ రూ. 97.02 (+0.91).

చెన్నై: పెట్రోల్ రూ. 105.31 (+0.87), డీజిల్ రూ. 96.98 (+0.91).

గురుగ్రామ్: పెట్రోల్ రూ. 100.38 (+0.87), డీజిల్ రూ. 92.92 (+0.91).

నోయిడా: పెట్రోల్ రూ. 98.78 (+0.87), డీజిల్ రూ. 93.12 (+0.91).

గత 10 రోజుల్లో ఏం జరిగింది? 

ఈ నెలలో పెట్రోల్ ధరల బాదుడు మే 16న ప్రారంభమైంది. ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా లీటరుకు రూ. 3 వరకు పెంచారు. ఆ తర్వాత మే 19న మెట్రో నగరాల్లో మరో 90 పైసలు పెరిగాయి. తాజా పెరుగుదలతో కలిపి చూస్తే, గత పది రోజుల్లోనే ఇంధన ధరలు దాదాపు రూ.5 మేర పెరిగాయి. కేవలం పెట్రోల్, డీజిల్ ధరలే కాకుండా ఇటీవలి రోజుల్లో సిఎన్‌జి (CNG), పిఎన్‌జి (PNG) ధరలు కూడా పలు నగరాల్లో పెరిగాయి.  

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? 

అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇలా ధరలు పెంచుతున్నారు. ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు నిలకడగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. వెస్ట్ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఏ చిన్న మార్పు వచ్చినా, అది మన దేశీయ ధరలపై ప్రభావం చూపుతుంది

సామాన్యుడిపై ప్రభావం  

వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు అన్ని రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతాయి. దీంతో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. రవాణా భారం పెరిగితే అది చివరకు సామాన్య వినియోగదారుడిపైనే పడుతుంది, దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. మే నెలలో మూడోసారి జరిగిన ఈ ధరల పెంపు మధ్యతరగతి జీవి బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తోంది.