Hyderabad Terror Case: రెండ్రోజుల కిందట హైదరాబాద్ లో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేసి 10 మంది పీఎఫ్ఐ నేతలను అరెస్ట్ చేశారు. బీజేపీ నాయకులను, ఆర్ఎస్ఎస్ నేతలను, పండగలను లక్ష్యంగా చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజీ హసన్ పరూక్ కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఇటీవల అదుపులోకి తీసుకున్న పీఎఫ్ఐ నేతలను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి వారిని జడ్జి ముందు హాజరు పరిచారు. అరెస్టు అయ్యి రిమాండ్ కు తరలించిన ముగ్గురు నిందితుల్లో అబ్దుల్ జాహెద్ కు 22 ఏళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అబ్దుల్ జాహెద్ ప్రసంగాలతోనే మహ్మద్ సమీయుద్దీన్, మాజీ హసన్ పరూక్ తీవ్రవాదం వైపు ఆకర్షితులు అయినట్లు పోలీసులు తేల్చారు.
ముంబయిలో ఇద్దరి అరెస్ట్..
2018లో ఐసిస్ లో చేరేందుకు సిరియా పయనమైన ఇద్దరిని అధికారులు ముంబయి ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. స్థానిక యువతను ఉగ్రవాద సంస్థల్లోకి ముగ్గురు నిందితులూ రిక్రూట్ మెంట్ చేపట్టారు. ఆ నిధులు పాకిస్థాన్ నుంచి చేరుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. గ్రనేడ్లు నగరానికి ఎవరు తీసుకువచ్చారు.. ఏ మార్గంలో వీరికి చేర్చారు.. దీని వెనక ఎవరెరవరి ప్రమేయం ఉంది అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్..
పాక్ లో తలదాచుకుంటున్న62 ఏళ్ల పర్హతుల్లా అలియాస్ అబు సుఫియాన్ అలియాస్ సర్దార్ సాహెబ్ ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు వెతుకుతున్న ఉగ్రవాది. అతడు ఓ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అని అధికారులు చెబుతున్నారు. కేంద్రం ప్రకటించిన వ్యక్తిగత ఉగ్రవాదుల జాబితాలో కూడా పర్హతుల్లా అలియాస్ అబు సుఫియాన్ పేరు ఉంది. సైదాబాద్ లోని కూర్మగూడ పర్హతుల్లా అలియాస్ సర్దార్ సాహెబ్ స్వస్థలం. మైనార్టీ సంస్థలో పని చేసిన ఘోరీ 1981లో బయటకు వచ్చాడు. సౌదీ అరేబియాలో చేరి అక్కడి నుంచే లష్కరే తోయిబా, జైషే ఈ మహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలకు పని చేస్తున్నాడు. దేశంలో పలు బాంబు పేలుళ్లలోనూ పర్హతుల్లా ప్రధాన సూత్రధారి అని పోలీసులు గుర్తించారు.
సాధారణ జీవితం గడుపుతున్నట్లు కనిపించినా..
సౌదీలో ఉన్న ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు ప్రస్తుతం పాక్ కు తన మకాం మార్చాడు. అతడి వ్యక్తిగత సహాయకుడు తాజాగా అరెస్టయిన అబ్దుల్ జాహెద్ సోదరుడు మాజిద్ పని చేస్తున్నాడు. 2005లో టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న బంగ్లాదేశ్ కు చెందిన డాలిన్ కు జాహెద్ ఆశ్రయం కల్పించాడు. ఈ కేసులో అరెస్టు అయి 2017లో జైలు నుంచి విడుదల అయ్యాడు. 12 ఏళ్ల పాటు జైలులో ఉన్న జాహెద్ బయటకు వచ్చాక వెల్డింగ్ దుకాణం, స్తిరాస్తి వ్యాపారంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జాహెద్ ఉగ్రవాదం వదిలేసి మారాడనే భావించినప్పటికీ.. రెండేళ్ల తర్వాత పాత పరిచయాలతో మరోసారి ఉగ్రవాద కార్యకలాపాలు చేయడం ప్రారంభించాడు. పాకిస్థాన్ లో ఉన్న సోదరుడు మాజిద్ అందు బాటులోకి రావడంతో భావసారుప్యత గల యువకులను ఎంపిక చేశాడు. పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చే ఆదేశాలతో గుట్టుగా కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చాడు. వీరు ఉగ్రవాదం వీడి సాధారణ జీవితం గడుపుతున్నట్లు పైకి కనిపించినప్పటికీ... కేంద్ర నిఘా సంస్థలు మాత్రం వారిని ఓ కంట కనిపెడుతూనే వస్తున్నాయి. వారి కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాయి. జావెద్ సాధారణ జీవితంలో గడుపుతున్నట్లు కలరింగ్ ఇచ్చి తిరిగి ఉగ్ర కార్యకలాపాలు ప్రారంభించడాన్ని అధికారులు గుర్తించారు. అలా ఉగ్రకుట్రను భగ్నం చేశారు.
పోలీసుల అదుపులో 20 మంది అనుమానితులు..
రిక్రూట్ మెంట్, గనేడ్స్ రవాణా, పేలుళ్ల కుట్ర బయట పడకుండా ఉగ్రమూకలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిఘా సంస్థలు, పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఎన్ క్పిఫ్ట్ యాప్ ను ఉపయోగించారు. దాని ద్వారానే కోడ్ భాషలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. ప్రస్తుతం ఎన్ క్రిఫ్ట్ యాప్ లో పాక్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలతో పంచుకున్న అంశాలు, చాటింగ్ ను పోలీసులు డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. ఇంత భారీ కుట్రను అమలు చేసేందుకు సహకరించిన వావరి వివరాలు సేకరిస్తున్నారు. సుమారు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై కేంద్ర నిఘా వర్గాలు, దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ నుంచి కశ్మీర్ చేరిన గ్రనేడ్ నగరానికి ఎవరి ద్వారా చేరవేశారనే దానిపై వివరాలు రాబడుతున్నారు.