తెలంగాణలో మరో క్యాపీయింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల్లో కాపీయింగ్ జరిగినట్టు కేసు నమోదు అయింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నారు. 


సికింద్రాబాద్‌లోని ఎస్‌వీఐటీ సెంటర్‌లో స్మార్ట్ కాపీయింగ్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. చింతపల్లి చైతన్య కృష్ణ అనే విద్యార్థి తాను రాసిన జవాబులను వాట్సాప్‌ ద్వారా ఫ్రెండ్స్‌కు షేర్ చేశాడు. వివిధ ఎగ్జామ్స్‌ సెంటర్‌లలో పరీక్షలు రాస్తున్న నలుగురు ఫ్రెండ్స్‌కు ఇలా షేర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. 


దేశంలోని 23 ఐఐటీల్లో సీట్ల కోసం ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరిగింది. ఆన్‌లైన్ విధానంలో జరిగిన పరీక్షలు ఈ విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 35 వేల మంది ఈ పరిక్ష రాశారు. 


ఈ కాపీయింగ్‌ పాల్పడిన విద్యార్థులంతా ఒకే కాలేజీకి చెందిన వారుగా గుర్తించారు. ప్యాట్నీలోని ఎస్‌వీఐటీ కాలేజీలో పరీక్ష రాసిన చైతన్య కృష్ణ... ఆన్సర్స్‌ను వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశాడు. వాటిని ఎల్బీనగర్‌, మల్లాపూర్‌, మౌలాలి కేంద్రాల్లో పరీక్ష రాస్తున్న మిగతా ఫ్రెండ్స్‌ కాపీ చేశారు. 


చైతన్య కృష్ణ కదలికలపై అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్‌ చెక్ చేస్తే మొబైల్ లభించింది. వెంటనే ఎగ్జామ్‌ సెంటర్‌ అధికారులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చైతన్య కృష్ణను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.