Hyderabad Cable Bridge: హైదరాబాద్‌కు భవిష్యత్తులో మరో తీగల వంతెన నిర్మితం కానుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నగరంలోని మీర్ ఆలం ట్యాంక్ వద్ద కేబుల్ స్టేడ్ బ్రిడ్జిని ప్రతిపాదించింది. మీర్ ఆలం ట్యాంక్ బ్రిడ్జి 2.5 కిలో మీటర్ల పొడవు కాగా, దాన్ని  ఆరు లేన్లతో రూపొందిస్తారని  అధికారులు తెలిపారు. దీని సెంట్రల్ స్పాన్ 350 మీటర్లు, ఇంకా దాని పైలాన్లు 100 మీటర్ల ఎత్తు ఉంటుంది. డీ మార్ట్ - గురుద్వారా - కిషన్‌బాగ్ - బహదూర్‌ పురా క్రాస్‌ రోడ్స్ మార్గంలో ప్రతిపాదించిన ఈ వంతెనతో బెంగళూరు నేషనల్ హైవేని అత్తాపూర్ సమీపంలోని చింతల్‌ మెట్‌తో కలుపుతుంది.


ట్రాఫిక్‌ను సులభతరం చేయడంతో పాటు చాలా మందికి అవాంతరాలు లేని ప్రయాణం కల్పించేందుకు వీలుగా ఈ వంతెనను ప్రతిపాదించినట్లుగా హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. వంతెన పై నుండి నీటి సరస్సు కనిపిస్తూ ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుందని ఆ HMDA అధికారి వెల్లడించారు. 


రద్దీగా ఉండే బెంగళూరు జాతీయ రహదారి - చింతల్‌మెట్ మార్గంలో చాలా కాలంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటోంది. మీర్ ఆలం ట్యాంక్ బ్రడ్జి నిర్మించిన తర్వాత ఈ సమస్య పోతుందని భావిస్తున్నారు. ఈ బ్రిడ్జి పాత బస్తీలో టూరిజంను కూడా పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం భూసేకరణకు సంబంధించి సమస్యలు అంతగా ఎదురు కాకపోవచ్చని అంటున్నారు. 


ఖర్చు ఎంత అంటే..
దుర్గం చెరువుపై ఉన్న 800 మీటర్ల కేబుల్‌ బ్రిడ్జికి రూ.184కోట్ల ఖర్చు అయింది. అయితే, ఈ మీర్ ఆలం ఈ బ్రిడ్జి నిర్మాణానికి భారీ వ్యయం అవుతుందని అంచనా వేశారు. మొత్తం మూడు డిజైన్లను రూపొందించారు. ఫైనల్‌ అయ్యే డిజైన్‌ను బట్టి వ్యయం ఉండనుంది. 


దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి తరహాలోనే మీరాలం చెరువుపై తీగల వంతెన ఏర్పాటు చేయాలని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్‌ రూపకల్పన బాధ్యతలను హెచ్‌ఎండీఏకు అప్పగించింది. గతేడాది డిసెంబర్‌లోనే టెండర్లను ఆహ్వానించగా, పలు కన్సల్టెన్సీలు ముందుకొచ్చాయి. ప్రముఖ కన్సల్టెన్సీకి ఈ ఏడాది ప్రారంభంలోనే పనులు అప్పగించారు. నాలుగు నెలల్లో డీపీఆర్‌ అందించాలని నిబంధనలు విధించగా, తాజాగా డీపీఆర్‌ తుదిదశకు చేరినట్లు తెలిసింది. జూపార్కు సమీపంలోనే ఈ కేబుల్‌ బ్రిడ్జి రానుండడంతో ప్రత్యేక థీమ్‌ను రూపొందించాలని నిర్ణయించారు. ఈ థీమ్‌ కేబుల్‌ బ్రిడ్జి, మీర్ ఆలం ట్యాంక్‌ విశిష్టతను తెలిపేలా కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.