Hyderabad Pub Drugs Case: హైదరాబాద్‌లోని​ పబ్‌లో పోలీసులు దాడి చేసిన ఘటనలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆకస్మిక దాడుల్లో చిక్కిన వారి నుంచి డ్రగ్స్ ఆనవాళ్లు టెస్టు చేసేందుకు నమూనాలు ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు. వారిని వదిలివేయడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. దాడుల తర్వాత పట్టుబడ్డ వారిలో ప్రముఖులు ఉండడంతో అధికారులకు మంత్రి కేటీఆర్​ ఫోన్​ చేసి చూసిచూడనట్లు వదిలేయమన్నారని రేవంత్​ రెడ్డి ఆరోపించారు.


పబ్‌లో దొరికిన వారిలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) బంధువులు ఉన్నారని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని, ఎవరి మీద అనుమానం ఉందో వచ్చి చెక్ చేసుకోవాలని సవాలు విసిరారు. దమ్ముంటే కేటీఆర్​ నమూనాలు ఇప్పించగలరా అని ఛాలెంజ్ చేశారు. అసలు డ్రగ్స్​ కేసులో కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసింది తానే అని గుర్తు చేశారు. పంజాబ్​‌లో డ్రగ్స్​ బారినపడి ఎందరో యువత నిర్వీర్యం అయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసులో దర్యాప్తు బాగా జరిపించాలని అన్నారు. విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్​ చేశారు.


ధాన్యం కొనుగోలు అంశం గురించి మాట్లాడుతూ.. ఈ విషయంలో టీఆర్ఎష్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు రాజకీయ రాక్షస క్రీడకు తెరలేపాయని మండిపడ్డారు. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్ గతంలోనే కేసీఆర్‌ కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారని అన్నారు. కేసీఆర్‌ సంతకం రైతుల పట్ల మరణశాసనంగా మారిందని రేవంత్‌రెడ్డి అన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటను కొనే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. తెలంగాణలో రెండు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని ఆరోపించారు. పేర్కొన్నారు. రైతుల జీవితాలతో టీఆర్‌ఎస్‌, బీజేపీ చెలగాటం ఆడుతున్నాయని.. వడ్లను కనీస మద్దతు ధర రూ.1960తో కొనాలని డిమాండ్ చేశారు. కొన్న వడ్లను ఏం చేసుకుంటారో మీ ఇష్టమని కేంద్రానికి సూచించారు. రైతులను మోసం చేయడానికి సమస్యను మరింత కఠినం చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.



రైతులు కష్టపడి పండించిన పంటను కొనే బాధ్యత ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతంలో మోదీ చెప్పలేదా? అని నిలదీశారు. కేంద్రం మద్దతు ధరను వరికి ప్రకటించిందా? లేదా బియ్యానికి ప్రకటించిందా? అని అన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి ఏం చేస్తాయో మాకు తెలియదు, వడ్లు మాత్రం కొనాల్సిందేనని అన్నారు. మిల్లర్లతో కేసీఆర్‌ కుటుంబం కుమ్మక్కయ్యిందని ఆరోపించారు.