Hyderabad: కోవిడ్ ముందు భాగ్యనగరంలో చాలా మంది సొంత ఇళ్లు ఉండాలని భావించారు. అయితే కరోనాతో అంతా అతాలకుతలం అయ్యింది. మూడేళ్ల పాటు ఆర్థిక స్థితిగతులు గణనీయంగా మారిపోయాయి. చిన్న, మధ్య తరగతి కుటుంబాల గురించి చెప్పలేని పరిస్థితి. కోవిడ్ కొట్టిన దెబ్బకు సొంత ఇంటి ఆలోచనను చాలా మంది విడిచిపెట్టేశారు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. కోవిడ్ ప్రభావం తగ్గింది. గత రెండేళ్లుగా పరిస్థితులు క్రమక్రమంగా కుదుటపడుతున్నాయి. 


హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరం చుట్టు పక్కల అన్ని రకాల మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో నివాస యోగ్యమైన ఆస్తులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. తమకు కావాల్సిన వాటిని దక్కించుకునేందుకు ఎంత రేటైనా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సొంతింటి కల సాకారం చేసుకుంటున్నారు. దీంతో భాగ్యనగరంలో మరో సారి ఇళ్ల కొనుగోళ్లు జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రాపర్టీ రిజస్ట్రేషన్లు 30 శాతం పెరిగాయట.


ఆస్తుల రిజిష్ట్రేషన్‌లపై నైట్ ఫ్రాంక్ ఇండియా అనే సంస్థ ఇచ్చిన  నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో సంవత్సరానికి 30 శాతం పెరుగుదల కనిపించిందట. 2023 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో 6,185 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నివేదిక పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం పెరుగుదల నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. ఈ నెలలో రిజిస్టర్ అయిన ఆస్తుల మొత్తం విలువ 42 శాతం పెరిగిందని, రూ.3,378 కోట్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది. అంతే కాదు ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని వెల్లడించింది.


హైదరాబాద్ రియల్ మార్కెట్ పరిధిలో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి నాలుగు జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం మంది రూ.50 లక్షల విలువ చేసే ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. నివేదిక ప్రకారం సెప్టెంబర్ 2023లో హైదరాబాద్‌లో రూ. 25 లక్షల నుంచి 50 లక్షల పరిధిలో అత్యధికంగా ఆస్తి రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. మొత్తం రిజిస్ట్రేషన్‌లలో ఇవి 51 శాతం. అలాగే రూ. 25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఆస్తులు మొత్తం రిజిస్ట్రేషన్‌లో 15 శాతంగా ఉన్నాయి. రూ.1 కోటిపైగా ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్ల వాటా వాటా 9 శాతంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే కోటి రూపాయాలపైన విలువ ఉన్న ఆస్తి రిజిష్ట్రేషన్లు శాతం 8 శాతం ఉన్నాయి.


2023 సెప్టెంబర్‌లో రిజిస్టర్ అయిన ఆస్తుల్లో ఎక్కువ 1000 నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగివే 71 శాతం ఉన్నాయి. అలాగే 2000పైన చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. సెప్టెంబర్ 2022లో 9 శాతంగా ఉండగా అది ఇప్పుడు 11 శాతానికి చేరింది. అయితే 500 నుంచి 1000 చదరపు అడుగుల విస్తీర్ణం ఇళ్లకు డిమాండ్ తగ్గింది. వీటి రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్‌లో 14 శాతంగా ఉన్నాయి. గత సెప్టెంబర్  16 శాతంగా ఉండగా.. 2 శాతం పడిపోయింది. 


నివేదిక గురించి నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ.. హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ ప్రస్తుతం చెప్పుకోదగ్గ పురోగమనంలో ఉందన్నారు. ప్రధానంగా నగరంలో డిమాండ్ పెరిగిందని చెప్పారు. కొనుగోలుదారులు విస్తృత శ్రేణి వసతులు కోరుకుంటున్నారని, ముఖ్యంగా ఈ డిమాండ్ నగర ప్రాంతంలో ఎక్కువగా ఉందన్నారు. సౌకర్యాలు ఎక్కువగా ఉండే హౌసింగ్ కమ్యూనిటీలకు డిమాండ్ ఉందని చెప్పారు.