Hyderabad Rains Alert: హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. గత వారం కురిసిన వర్షాలకు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. తాజాగా మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు, వరద నీటి పరిస్థితుల కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులతో పాటు డీఆర్ఎఫ్ సిబ్బంది జంట నగర వాసులను హెచ్చరించారు.
నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, యూసఫ్ గూడ, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, సనత్ నగర్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. రాయదుర్గం, కొండాపుర్, మాదాపుర్, గచ్చిబౌలి, అత్తాపూర్, రాజేంద్రనగర్, మెహిదిపట్నం, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్ ఏరియాల్లోనూ వర్షం పడుతోంది. ఒక్కసారిగా తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదు కావడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సెక్రటేరియట్ ముందు రోడ్డు జలమయమై చెరువులా కనిపిస్తోంది. పలు ఏరియాలలో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
సుల్తాన్ బజార్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లి, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలతో నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆఫీసు పని పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. వర్షం కారణంగా క్యాబ్ సర్వీసులు అధిక మొత్తాన్ని చూపిస్తుండటంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. కొన్ని ఏరియాలలో అధిక మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా క్యా్బ్ సర్వీసులు అందుబాటులో లేవు. బుకింగ్ అయ్యాక డ్రైవర్లు రాని పరిస్థితి కనిపిస్తోంది. ఎటు చూసినా బస్సులు జనాలతో కిక్కిరిసిపోయాయి. మెట్రోలో ఇంటికి వెళ్దామని వెళ్తే అక్కడ సైతం భారీగా జనాలు ఉండటంతో అవి సైతం కిక్కిరిసిపోయి నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు.
నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో రెండు నుంచి నాలుగు రోజులపాటు పలు చోట్ల వర్షాలు పడతాయని చెప్పింది. సోమవారం నుంచి మంగళవారం వరకు ఖమ్మం, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial