Hyderabad News: హైదరాబాద్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ భవనంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఓయో హోటల్‌‌‌లో గుట్టుగా వ్యభిచారం సాగుతుండగా నిర్వహకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు ఇద్దరు యువతులు, నలుగురు విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి పట్టుబడ్డ వారిని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు.


ఈ దాడులకు సంబంధించి పోలీసులు వివరాలు వెల్లడించారు. అమీర్ పేటలోని బల్కంపేటలో ఎస్‌బీఐ బ్రాంచ్ సమీపంలో తెన్నేటి టవర్స్ అని ఓ భవనం ఉంది. అందులో ఓయో లాడ్జిని నిర్వహిస్తున్నారు. ఆ లాడ్జిలోని గదుల్లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ పద్ధతుల ద్వారా విటులను ఆకర్షించి ఇక్కడికి రప్పించుకొని యువతుల ద్వారా వ్యభిచారం చేస్తున్నారు. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో టాస్క్‌ఫోర్సు పోలీసులు ఆకస్మిక సోదాలు చేశారు. ఈ సమయంలో హోటల్‌ వద్ద వ్యభిచార నిర్వహకుడు రమేష్‌ అనే వ్యక్తి అక్కడే ఉండగా అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. గదిలో ఉన్న కాచికూడకు చెందిన ఆడిటర్‌ వేణుకుమార్, ఓ యువతిని అరెస్టు చేశారు.


రమేష్‌ను పోలీసులు విచారణ జరపగా తాను జనార్దన్‌ అనే మరో వ్యక్తి దగ్గర పని చేస్తుంటానని చెప్పడంతో లీలా నగర్‌లోని విద్యుత్‌ టవర్స్‌లో ప్రధాన నిర్వాహకుడు జనార్దన్‌ను అరెస్టు చేశారు. జనార్దన్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఇంకో నిర్వాహకుడు నాగుర్ మీరా, తిరుమల్‌ రావు అనే వ్యక్తులను కూడా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ సోదాల్లో మరో నలుగురు విటులు, ఇద్దరు యువతులను కూడా అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా యువతులను తీసుకువచ్చి వివిధ చోట్ల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు (SR Nagar Police Station) అప్పగించారు.
 
డ్రగ్స్ పెడ్లర్ అరెస్టు
హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్‌ను కూడా పోలీసులు చేధించారు. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు ఈ కేసు వివరాలను విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. నార్కోటిక్ ఎన్‌ఫోర్స్ మెంట్ విభాగం డీసీపీ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ నార్కోటిక్ వింగ్, అఫ్జల్ గంజ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టాం. ఈ ఆపరేషన్ లో ఓ డ్రగ్ ఫెడ్లర్‌తో పాటు నలుగురు కస్టమర్‌లను అరెస్ట్ చేశాము. అశుతోష్ అనే డ్రగ్స్ పెడ్లర్ ఇందులో కీలకంగా ఉన్నాడు. ఈజీ మనీ కోసం అశుతోష్ హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్నాడు. ముందు అశుతోష్ హ్యష్ అయిల్ కంజ్యుమర్ ఉన్నాడు. అనంతరం అతను పెడ్లర్‌గా మారాడు.


ఇతని వద్ద హ్యష్ ఆయిల్ కొంటున్న మరో నలుగురిని అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్ లో 300 గ్రాముల యాష్ అయిల్, ఏడు సెల్ ఫోన్లు, బైక్ సీజ్ చేశాం. 5 గ్రాముల చొప్పున చిన్న చిన్న బాటిళ్లలో డ్రగ్స్ ఉంచి అశుతోష్ విక్రయిస్తున్నాడు. బయట నుండి హ్యాష్ ఆయిల్ తెపిస్తున్నారు. ఇక్కడ విక్రయిస్తున్నారు. బయట 5 గ్రాముల హ్యష్ ఆయిల్ ను రూ.500 నుండి రూ.600 లకు కొని ఇక్కడ అధిక రేట్లకు విక్రయిస్తున్నాడు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం’’ అని డీసీపీ చక్రవర్తి వెల్లడించారు.