TSRTC News: పెట్రోల్, డీజిల్ ధరల (Petrol, Diesel Prices) పెరుగుదల సామాన్యుల నడ్డి విరుస్తోంది. ఇప్పటికే అతి పెద్ద నిత్యావసరం అయిన వంట గ్యాస్ ధర ఏకంగా రూ.50 ఎగబాకిపోయింది. ఇప్పుడు మళ్లీ మరో షాకింగ్ న్యూస్ కలవరానికి గురి చేస్తోంది. డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతూ ఉన్న వేళ టీఎస్ఆర్టీసీ కూడా ఆ నష్టాల్ని భరించలేక ఆ భారాన్ని సామాన్యులపైకే నెట్టింది. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల బస్‌పాసుల చార్జీలను ఆర్టీసీ పెంచింది. 


ఈ పెరిగిన కొత్త ధరలు ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానున్నట్లు టీఎస్ఆర్టీసీ (TSRTC) అధికారులు వెల్లడించారు. జనరల్‌ బస్‌ టికెట్‌ (జీబీటీ) పాసులు కూడా భారీగానే పెరిగాయి. ఈ కేటగిరీలో ఆర్డినరీ బస్సుల పాసు చార్జీ గతంలో రూ.950 ఉండగా.. తాజాగా రూ.1150కి పెంచనున్నారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు పాసు ధర నెలకు రూ.1,070 ఉండగా.. తాజాగా రూ.1,300కు పెంచారు. మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణించే వీలున్న పాసులకు పాత ధర రూ.1,185 కాగా, ప్రస్తుతం రూ.1,450కి పెరగనుంది. మెట్రో లగ్జరీ (ఏసీ) రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్‌ పాస్‌ రూ.2,500 నుంచి రూ.3 వేల చొప్పున ఎగబాకాయి.


వీరికి కూడా బాదుడే..
మరోవైపు, ఎన్‌జీఓ బస్సు పాసులకు సంబంధించి ఆర్డినరీ పాస్‌ చార్జీ రూ.320 నుంచి రూ.400 కు పెంచాలని నిర్ణయించారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి పెరుగుతుంది. మెట్రో డీలక్స్‌ బస్సు పాసు రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్‌ – ఆర్టీసీ కోంబో టికెట్‌ చార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెంచుతారు. 


కొద్ది రోజుల క్రితమే ఆర్టీసీ సేఫ్టీ సెస్‌ పేరుతో బస్సు టికెట్‌పై రూపాయి పెంచి, చిల్లర సమస్య రాకుండా ధరను రౌండాఫ్‌ చేయటంతో గరిష్టంగా టికెట్‌ ధర రూ.5 మేర పెరిగింది. గతంలో రౌండాఫ్‌ ధర కాస్త ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో దాన్ని తగ్గించిన ఆర్టీసీ మళ్లీ పాత ధరలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. తాజాగా బస్‌పాస్‌ చార్జీలను పెంచారు. అసలైన ఆర్టీసీ చార్జీల పెంపు ప్రతిపాదన ప్రస్తుతం సీఎం వద్ద పెండింగులో ఉంది. ఆయన అనుమతిస్తే అవి కూడా పెరగనున్నాయి. అదే జరిగితే సామాన్యులపై మరింత భారం పడనుంది.


కరోనా లాక్‌ డౌన్, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల నష్టాల్లో, అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీని (TSRTC) గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ (VC Sajjanar) తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఓ వైపు ఆఫర్లు, ప్రత్యేక ప్యాకేజీలతో ప్రయాణికులను ఆకర్షిస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. టీఎస్‌ఆర్టీసీ ముందుకు తీసుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు.