గజ్వేల్ పర్యటనకు సిద్ధమైన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. లోటస్ పాండ్‌లోని ఆమె ఇంటి వద్దకు భారీగా పోలీసులు తెల్లారేసరికి చేరుకున్నారు. ఎవర్నీ లోనికి పోనివ్వకుండా ఆంక్షలు పెట్టారు. లోపలి వారిని కూడా బయటకు వెళ్లనీయలేదు. 


ఆంక్షల విషయం తెలుసుకున్న షర్మిల.. బయటకు వచ్చి పోలీసులతో మాట్లాడారు. ఎందుకు హంగామా చేస్తున్నారని వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం వారికి హారతి ఇచ్చి లోపలికి స్వాగతం పలికారు. షర్మిల చర్యతో కంగుతిన్నారు పోలీసులు.


షర్మిల గజ్వేల్ వెళ్లేందుకు సిద్ధమవ్వడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఆమె పర్యటన అడ్డుకుంటామని బీఆర్‌ఎస్‌ శ్రేణులు చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. షర్మిల గజ్వేల్‌లోని తీగల గ్రామానికి వెళ్లడానికి వీల్లేదని చెప్పారు. 


పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్‌  సమస్య వస్తుందని పోలీసులు చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. అక్కడే ఉన్న పోలీసు అధికారి ఒకరు మీరు వెళ్లకపోతే సమస్య రాదు కదా అని అనడంతో మరింత సీరియస్ అయ్యారు షర్మిల. అంటే రాజకీయ నాయకులు ఎక్కడికీ వెళ్లొద్దా అని ప్రశ్నించారు. వాళ్లను ఎంత మందిని హౌస్ అరెస్టు చేశారని నిలదీశారు.