Kishan Reddy Deeksha disrupts : 


హైదరాబాద్‌: కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి చేపట్టిన ఉపవాస దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 9 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించకపోవడంతో యువతకు అన్యాయం జరిగిందంటూ కిషన్ రెడ్డి ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్ వద్ద 24గంటల దీక్షను బుధవారం ఉదయం చేపట్టారు. అయితే ఆయన దీక్షకు సాయంత్రం 6 గంటల వరకే పర్మిషన్ ఉందంటూ పోలీసులు కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నేతలు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.


కిషన్ రెడ్డి మాత్రం తాను గురువారం ఉదయం 6 గంటల వరకు ఉపవాస దీక్ష కొనసాగిస్తానని చెబుతున్నారు. తన దీక్ష భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులను కిషన్ రెడ్డి హెచ్చరించారు. శాంతియుతంగా దీక్ష చేపడితే ప్రభుత్వం కుట్ర పూరితంగా తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేస్తుంటే, ఉద్రిక్తతల నడుమ పోలీసులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కిషన్ రెడ్డిని దీక్షా శిబిరం నుంచి లాగి పడేసిన పోలీసులు.. అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తల్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. నిరుద్యోగుల సమస్యపై శాంతియుతంగా దీక్ష చేస్తే అరెస్ట్ చేయడం దారుణం అన్నారు కిషన్ రెడ్డి.






పోలీసులతో కలిసి బీఆర్ఎస్ నేతలు కుట్రపూరితంగా తన దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇందిరా పార్క్ లో దీక్షా శిబిరం నుంచి కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఆయనను తరలించారు. తన దీక్ష 24 గంటలు అని, రేపు ఉదయం 6 గంటల వరకు పార్టీ ఆఫీసులోనూ ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు కిషన్ రెడ్డి. 


బీఆర్ఎస్ సర్కారును టార్గెట్ చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. ఈక్రమంలోనే బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఇందిరా పార్కు వద్ద నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో 24 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. మన ఉద్యోగాలు మనకే అని చెబుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో హామీలు ఇచ్చిన కేసీఆర్.. ఇప్పటికీ వాటిని నెరవేర్చలేకపోయారని విమర్శించారు. తెలంగాణ కోసం లక్షలాది మంది పోరాటం చేశారని... మొత్తం 1200 మంది విద్యార్థులు బలిదానం చేశారని గుర్తు చేశారు. కావాలనే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహిస్తూ... సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతోందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువతను మోసం చేసిందని ఆరోపించారు.