Telangana Weather: రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
గురువారం రోజు నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే శుక్రవారం రోజు నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లా భారీ వానలు పడనున్నట్లు చెప్పింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. అయితే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
ఈరోజు మరొక ఆవర్తనం బంగాళాఖాతంలోని మధ్య భాగాలు & పరిసరాల్లోని ఉత్తర బంగాళాఖాతం నుంచి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్రమట్టం నుంచి 4.5 కిలో మీటర్లు, 7.6 కిలో మీటర్ల మధ్య కొనసాగుతుంది. ఈరోజు క్రింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు భారీ వర్షాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో (తూర్పు) అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు రాష్ట్రములో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని తూర్పు, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో వాతావరణం..
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 06 నుంచి 08 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 84 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా..
ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చు. దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటరు వేగముతో వీయవచ్చు.