Hyderabad cyber cases: ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలు ఎక్కువైపోయాయి. పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ (Part time jobs) పేరుతోనూ, పెట్టుబడుల (Investments) పేరుతోనే, ఆన్‌లైన్‌ గేముల (Online games) పేరుతోనో... లింకులు పంపి...అమాయకులను మభ్యపెట్టి వారి అకౌంట్లు ఖాళీచేసేస్తున్నారు డిజిటల్‌ కేటుగాళ్లు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పలుమార్లు హెచ్చరికలు చేస్తున్నా... కొందరు వారి వలలో పడుతునే ఉన్నారు. కేటుగాళ్లు సొమ్ము స్వాహా చేశాక... మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుని లబోదిబో మంటున్నారు. తాజాగా రెండు కీలక సైబర్‌ కేసులను ఛేదించారు హైదరాబాద్‌ పోలీసులు.


డఫాబెట్‌ పేరుతో సైబర్‌ వల...
డఫాబెట్‌ వెబ్‌సైట్‌ (Dafabet website) ద్వారా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఢిల్లీ (Delhi) లో అరెస్టు చేశారు. డఫాబెట్‌ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పి అమాయకులను నట్టేట ముంచుతున్నారని పోలీసులు తెలిపారు. ఓ వ్యక్తి డఫాబెట్‌లో 70లక్షలు పెట్టి ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌కు చెందిన సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కూపీ లాగారు. నిందితుడు హరియాణాకు చెందిన హితేశ్‌ గోయల్‌గా గుర్తించాడు. అతన్ని ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు హైదరాబాద్‌ పోలీసులు. నిందితుడి నుంచి కోటి రూపాయల 40లక్షల నగదు సీజ్‌ చేశామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 
యూనిటీ స్టాక్స్‌ పేరుతో సైబర్‌ చీటింగ్‌
యూనిటీ స్టాక్స్‌ (Unity Stocks) పేరుతో మోసాలు చేస్తున్న వ్యక్తిని కూడా అరెస్టు చేశారు హైదరాబాద్‌ పోలీసులు. హైదరాబాద్‌కు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. యూనిటీ స్టాక్స్‌ పేరుతో రూ.3.16 కోట్లు మోసం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో కూపీ లాగిన పోలీసులు... నిందితుడిని రోనక్‌తన్నాగా గుర్తించారు. ఇతడు దుబాయ్‌ నుంచి మోసాలకు పాల్పడేవాడని చెప్తున్నారు. నిందితుడి బ్యాంక్‌ ఖాతాలోని 20 లక్షల రూపాయలను ఫ్రీజ్‌ చేసినట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిందితుడు రోనక్‌తన్నాకి సహకరించిన మరో ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశామన్నారు. నిందితుడు 95 బ్యాంక్‌ ఖాతాలు వాడుతున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు.


పటాన్‌చెరులో సైబర్‌ మోసం
పార్ట్‌టైమ్‌ జామ్‌ పేరుతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినే ముంచాడో సైబర్‌ కేటుగాటు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి పార్ట్‌టైమ్‌ జామ్‌ పేరుతో మెసేజ్‌ రాగా... ఓపెన్‌ చేసి అప్లై చేశారు. వెంటనే ఓ ఐడీ ఇచ్చి 3వేల రూపాయలు చెల్లించాలని కోరారు కేటుగాళ్లు. నిజమే అని నమ్మిన ఉద్యోగి మూడు వేల రూపాయలు చెల్లించాడు. ఆ తర్వాత కూడా డబ్బులు కట్టాలని లింకులు పంపుతూ వచ్చారు సైబర్‌ నేరగాళ్లు. ఇలా.. మొత్తం 15లక్షల 18వేల రూపాయలు చెల్లించిన తర్వాత మోసపోయానని గ్రహించాడా సాఫ్ట్‌వేర్‌. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు.