Formula E race Cancell: ఫార్ములా రేస్ అభిమానులకు షాక్ తగిలింది. హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ముల ఈ రేస్‌ను రద్దు చేశారు నిర్వాహకులు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ .. ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రకటన రిలీజ్ చేసింది. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆ సంస్థ తెలంగాణ మున్సిపల్ శాఖకు నోటీసులు ఇచ్చింది.
ఫిబ్రవరి 10న జరగాల్సిన రేసు రద్దు
ఈ-రేస్ సీజన్ 10కు చెందిన నాలుగవ రౌండ్ హైదరాబాద్‌లో ఫిబ్రవరి 10వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ఆ రేస్‌ను రద్దు చేస్తున్నట్లు ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మున్సిపల్ శాఖ.. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 30వ తేదీ జరిగిన ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించినట్టు ప్రకటనలో పేర్కొంది. అందుకే ఫార్ములా ఈ-రేస్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది ఫార్ములా ఈ ఆపరేషన్స్. ఈ మేరకు మున్సిపల్ శాఖకు నోటీసులు జారీ చేసింది. కాంట్రాక్టును మున్సిపల్ శాఖ ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలపింది. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఎఫ్ఈవో ప్రకటించింది.
అక్టోబర్ 30న మొదటిసారి రేసు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఫార్ములా ఈ సంస్థ ఈ ప్రిక్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్లతో కలిసి 2023, అక్టోబర్ 30న రేసింగ్‌కు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఫార్ములా- ఇ రేసింగ్ మెక్సికోకు తరలి పోయింది. హైదరాబాద్‌కి బదులుగా హాంకుక్ మెక్సికో సిటీలో ఈ రేస్ నిర్వహించనున్నట్లు ఫార్ములా సంస్థ తెలిపింది. సీజన్ 10 రేస్‌లు జరగనున్న నగరాల్లో టోక్యో, షాంఘై, బెర్లిన్, మొనాకో, లండన్ నగరాలు ఉన్నాయి. జనవరి 13వ తేదీ నుంచి ఈ సీజన్ ప్రారంభంకానుంది. మెక్సికోలోని హాంకూక్‌లో తొలిరేస్ జరుగుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫార్ములా ఈ చీఫ్ చాంపియన్‌షిప్ ఆఫీసర్ ఆల్బర్టో లాంగో అసంతృప్తి
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయం తమను నిరాశపరిచినట్లు ఫార్ములా ఈ చీఫ్ చాంపియన్‌షిప్ ఆఫీసర్ ఆల్బర్టో లాంగో తెలిపారు. అందుకే భారత్‌లో మోటర్‌స్పోర్ట్స్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసినట్టు ప్రకటించారు. వరల్డ్ చాంపియన్‌షిప్ రేస్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం కీలకమని, కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో ఏర్పడ్డ కొత్త సర్కార్ నిర్ణయం వల్ల ఆ ఈవెంట్‌ను నిర్వహించలేకపోతున్నట్లు.. ఫార్ములా ఈ చీఫ్ చాంపియన్‌షిప్ ఆఫీసర్ ఆల్బర్టో తెలిపారు.
కాగా.. గత ఏడాదిలో ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ దగ్గర జరిగిన ప్రారంభోత్సవ రేస్ చాలా సక్సెస్ అయ్యిందని నిర్వాహకులు చెప్పారు. ఆ రేస్ వల్ల ఆ ప్రాంతంలో సుమారు 84 మిలియన్ల డాలర్ల ఆర్థిక ప్రగతి జరిగిందని ఫార్ములా ఈ సీఈవో జెఫ్ డోడ్స్ తెలిపారు. భారతీయ భాగస్వాములు మహేంద్ర, టాటా కమ్యూనికేషన్స్ సంస్థలను అసంతృప్తికి గురి చేసినట్లు అయిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ చర్య
ఫార్ములా రేసు రద్దుపై కేటీఆర్ కూడా స్పందించారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమే అని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఇ-ప్రిక్స్ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా మన నగరం దేశం బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుతాయని తెలిపారు. భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఇ-ప్రిక్స్‌ని తీసుకురావడానికి తాము చాలా కష్టపడ్డామని చాలా సమయాన్ని వెచ్చించామన్నారు.
ప్రపంచంలో హైదరాబాద్‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా చూపించడానికి, ఔత్సాహికులు, తయారీదారులు స్టార్టప్‌లను ఆకర్షించడానికి ఫార్ములా రేసును ఓ సాధనంగా చేసుకున్నట్టు వెల్లడించారు. అలాంటి ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృథా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.