Numaish Exhibition: ప్రతీ ఏటా ఎంతో గ్రాండ్ గా నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఈరోజు నుంచే ప్రారంభం కాబోతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1వ తేదీ అంటే ఆదివారం ప్రారంభమయ్యే ఈ నుమాయిష్.. 46 రోజుల పాటు సందడిగా సాగనుంది. అయితే ఈ ఎగ్జిబిషన్ ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ అలి, ప్రశాంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అప్పటి నుంచి నగరంలో నుమాయిష్ సందడి మొదలైనట్లే. ప్రతీ రోజూ మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10.30 వరకూ ఎగ్జిబిష్ గ్రౌండ్‌లోకి సందర్మకులను అనుమతిస్తారు. టికెట్ ధరను ఈసారి పెంచాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. గతంలో టికెట్ ధర రూ.30 ఉంటే ఈసారి నుంచి 40 రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే మధ్యాహ్నం 3 దాటాక ఎగ్జిబిషన్ లోపలకు సందర్మకులను అనుమతిస్తే, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ 600 రూపాయలు చెల్లించి నేరుగా కారులో లోపలికి వెళ్లి నుమాయిష్ చుట్టివచ్చే విధంగా ఈసారి అవకాశం కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా నాంపల్లి ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
82వ నుమాయిష్..
ఈ ఏడాది 82వ నుమాయిష్ ను నిర్వస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల వాళ్లు ఇక్కడకు వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేస్తారన్నారు. వీక్షకుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటర్ నెట్ కోసం బీఎస్ఎన్ఎల్ ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ కు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది విజిటర్స్ ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. ఇప్పటికే దాదాపు స్టాళ్ల కేటాయింపులు పూర్తి అవ్వడంతో స్టాళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
1938లో స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రోత్సహించేందుకు నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. కేవలం 50 స్టాల్స్‌తో ప్రారంభిమైన ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనలలో ఒకటిగా నిలుస్తోంది. హైదరాబాద్ స్టేట్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటి నుమాయిష్‌ను ప్రారంభించారు. అనంతరం నుమాయిష్ ఎగ్జిబిషన్(Numaish Exihibition) కు ఆదరణ పెరిగింది. స్థానిక పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, హోటళ్లు, ఫుడ్ కోర్ట్(Food Court)లతో పాటు దేశంలోని వ్యాపారులు నుమాయిష్ లో స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు ప్రజలకు చేరువయ్యేందుకు ఎగ్జిబిషన్ ను ఒక వేదికగా ఉపయోగపడుతుంది. 1949లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా దీని పేరు మార్చారు. అప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సి. రాజగోపాలాచారి(C.Rajagopalachari) ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంతో ప్రజాదరణ పొందింది. కరోనా కారణంగా రెండేళ్లుగా నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు నిర్వహణలో అవంతరాలు వస్తున్నాయి.