Hyderabad News: ఇస్తామన్న కట్నం సమయానికి ఇవ్వలేదనో, అబ్బాయి వేరే వాళ్లను ప్రేమించడమో లేదో అప్పటికే వధూవరులిద్దరిలో ఒకరికి పెళ్లై పిల్లలు ఉండడం వల్లనో పీటల మీద పెళ్లి ఆగిపోవడం మనం చాలా సార్లే చూసి ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం వివాహ విందులో చికెన్ పెట్టకుండా.. శాఖాహారం మాత్రమే పెట్టారని వరుడి స్నేహితులు గొడవ చేశారు. ఇది చిలికి చిలికి గాలి వానలా మారింది. దీంతో పెళ్లే ఆగిపోయింది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ షాపూర్ నగర్ లో సోమవారం తెల్లవారుజామున ఓ పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. జగద్గరిగుట్ట రింగ్ బస్తీకి చెంది వరుడు, కుత్బుల్లాపూర్ కు చెందిన వధువుకు సోమవారం తెల్లవారుజామున వివాహం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే షాపూర్ నగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఈ సందర్భంగా ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఆడ పెళ్లి వారు బిహార్ కు చెందిన మార్వాడీ కుటుంబీకులు కావడంతో శాకాహార వంటలు చేశారు. అయితే విందు ముగింపు దశలో పెళ్లి కుమారుడి స్నేహితులు భోజనానికి వచ్చారు. చికెన్ ఎందుకు పెట్టలేదంటూ గొడవకు దిగారు. శాఖాహారం మేం తినమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రంమలోనే ఇరుపక్షాల మధ్య గొడవ జరిగింది.
అయితే వెంటనే పెళ్లి కుమార్తె కుటుంబీకులు జీడిమెట్ల సీఐ పవన్ ను కలిసి విషయాన్ని తెలిపారు. స్పందించిన ఆయన ఇరు కుటుంబ సభ్యులను, వధూవరులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. గొడవలన్నీ మర్చిపోయిన బుధువారం అంటే ఈనెల 30వ తేదీన పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇలా కథ సుఖాంతమైంది.
మూడ్రోజుల క్రితమే కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య..
మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ తాగేవాళ్లకు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు, అయిన వాళ్లకు కూడా ఈ మద్యం ఎనలేని శోకాన్ని మిగిలుస్తుంది. రోజూ ఫుల్లుగా తాగి వచ్చి వేధిస్తుంటే.. కుటుంబ సభ్యులు నరకం చూస్తుంటారు. ఇలా నరకం అనుభవించి, అనుభవించీ తట్టుకోలేని ఓ ఇల్లాలు.. పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. అది జీర్ణించుకోలేని తాగుబోతు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాపిరెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకొని బలవన్మరణం చేసుకున్నాడు. అయితే మృతుడు గోపాల్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపాల్ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు మద్యానికి బానిసయ్యాడు. రోజూ ఫుల్లుగా తాగి వచ్చి భార్యను వేధించేవాడు. నిన్న కూడా ఇదే విషయమై ఇద్దరి మద్య గొడవ జరిగింది. భర్త ఎంత చెప్పినా తీరు మార్చుకోవడం లేదని భార్య.. నిన్న రాత్రి పిల్లలను తీసుకొని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య ఇళ్లొదిలి వెళ్లపోవడం తట్టుకోలేని భర్త గోపాల్ అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.