Hyderabad News: మైసమ్మ చెరువు మాయమవుతుంది, సున్నం చెరువు సున్నం సున్నం అయ్యింది, రంగనాథం చెరువుకు రంగం పాడేశారు, బోయిన్ చెరువుకు బొక్కలు పడుతున్నాయి. ఈ విధంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని చెరువులన్నీ మాయం అవుతున్నాయని మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను, ప్రభుత్వ భూములను భూబకాసూరుల నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ఓల్డ్ బోయిన్ పల్లి హస్మాత్ పేట్ లోని బోయిన్ చెరువును బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కన్నె ప్రకాష్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. చెరువుల అభివృద్ధి పేరిట కమిషన్ లు, కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎఫ్టీఎల్ స్థలాలను యథేచ్చగా ఆక్రమించి అమాయకులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ నాయకులే ఇందులో ప్రధాన నిందితులు అని తెలిపారు. చెరువులను, ప్రభుత్వ స్థలాలను కాపాడలేని ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
"మరి మన కూకట్ పల్లి ఎమ్మెల్యే కళ్లుండి చూడలేకపోతుర్రో, చెవులుండి వినలేకపోతుర్రో.. చెరువుల అభివృద్ధి పేరుతో చెరువుల వెనకాల ఉన్నటువంటి ఎఫ్టీఎల్ భూముల మీద కన్నేసిర్రని విశ్వసనీయ సమాచారం. కేవలం భూములను కాజేయడానికే ఈరోజు సుందరీకరణ పేరుతో పనులు నడుస్తున్న యవ్వారం. మొన్నటికి మొన్న మైసమ్మ చెరువు బాలాజీ నగర్ లో ఉంటది.. మైసమ్మ చెరువుకు సుందరీకరణ పేరుతోని పనులు ప్రారంభించమని వచ్చింది. వచ్చిన తెల్లారి నుంచే భూముల కబ్జాలు ప్రారంభం అయినయ్. కూకట్ పల్లి సర్వే నెంబర్ రాఘవేంద్ర సొసైటీలో ఇప్పటికీ కూడా కబ్జాలు జరుగుతున్నయ్." - మహేందర్, మూసాపేట్ కార్పొరేటర్