Aquarium In Hyderabad : హైదరాబాద్ చారిత్రక కట్టడాలతో పాటు ఆధునికతకు మారుపేరు. ఐటీ, టూరిజం రంగాల్లో భాగ్యనగరం దూసుకుపోతుంది. చార్మినార్, గొల్కోండ, బిర్లా టెంపుల్ ఇలా నగరంలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ మణిహారంలో మరో భారీ ప్రాజెక్టు చేరబోతుంది. ఓ నెటిజన్ ట్వీట్ కు రిప్లై ఇచ్చిన మంత్రి కేటీఆర్... దేశంలోనే అతిపెద్ద అక్వేరియంహైదరాబాద్ లో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ కొత్వాల్ గూడ ఎకో పార్క్ లో భారీ అక్వేరియంనిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు పనులు పూర్తయ్యాయని, త్వరలో అందుబాటులోకి తెస్తామని మంత్రి కేటీఆర్ నెటిజన్ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. ఈ ఎకో పార్క్ ను పక్షుల ఆవాస కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇందులో నిర్మిస్తున్న అక్వేరియంత్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
కొత్వాల్ గూడలో అక్వేరియం, ఎకో పార్క్
హైదరబాద్‌లో టన్నెల్ అక్వేరియంఎందుకు లేదని ఓ నెటిజన్ ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ... 'మేము కొత్వాల్‌గూడలో భారతదేశంలోనే అతిపెద్ద అక్వేరియం, పక్షుల ఆవాస కేంద్రం నిర్మిస్తున్నాం. పనులు జరుగుతున్నాయి' అని ట్వీట్ చేశారు. 2022 అక్టోబర్‌లోమంత్రి కేటీ రామారావు కొత్వాల్‌గూడలో ఎకో పార్క్‌కు శంకుస్థాపన చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అధికారులను ఆయన ఆదేశించారు. HMDA ప్రకారం, కొత్వాల్‌గూడ ఎకో-పార్క్‌లో గెజిబోస్, పెర్గోలాస్‌తో పాటు, ఆరు ఎకరాల్లో పక్షుల ఆవాస కేంద్రం, 2.5 కిలోమీటర్ల బర్డ్ వాక్, అక్వేరియం, సీతాకోకచిలుక తోట, సెన్సరీ పార్క్, ఓపెన్-ఎయిర్ థియేటర్, పలు అదురైన వృక్షాలు, తోటలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు చోట్ల ఫుడ్ కోర్టులు, వుడ్ క్యాబిన్‌లు, క్యాంపింగ్ టెంట్లు, ఇన్ఫినిటీ పూల్, కాన్ఫరెన్స్ హాల్‌ను కూడా నిర్మించాలని HMDA సూచించింది.
కూకట్ పల్లిలో టన్నెల్ అక్వేరియం ఎగ్జిబిషన్
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఈ వేసవిలో అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్ ఏర్పాటుచేస్తున్నారు. సముద్ర జీవులను 180-డిగ్రీల్లో వీక్షించేలా ఈ అక్వేరియం ఏర్పాటుచేస్తున్నారు. ఈ ప్రదర్శన శనివారం కూకట్‌పల్లిలో ప్రారంభమైంది. 60 రోజుల పాటు ఈ అక్వేరియం ఎగ్జిబిషన్ ఉంటుంది. నగరంలో తొలి అండర్ వాటర్ టన్నెల్ కావడంతో సందర్శకులలో ఉత్కంఠ నెలకొంది. స్టార్ ఫిష్, ఏంజెల్ ఫిష్, క్లౌన్ ఫిష్, సీ హార్స్, రాసెస్, ఈల్స్, బాక్స్ ఫిష్ ఇతర అసాధారణ జాతులతో సహా 500 విభిన్న మంచినీటి, ఉప్పునీటి జాతులు సుమారు 3000 చేపలను టన్నెల్ అక్వేరియంలో చూడవచ్చు. ఈ చేపలు మలేషియా, సింగపూర్ కేరళ నుంచి తీసుకొచ్చారు. ఈ జాతులను దగ్గరగా చూసే అద్భుతమైన అవకాశాన్ని ఎగ్జిబిషన్ నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన ప్రత్యేకమైన చేప జాతులలో అరపైమా రకం 60 కిలోల బరువు ఉంటుంది. ఈ చేప ప్రతిరోజూ ఒకటిన్నర కిలోల చికెన్ తింటుంది. ఈ చేప ప్రస్తుతం మార్కెట్‌లో రూ.6 లక్షలు ధర పలుకుతోంది. ఈ ఎగ్జిబిషన్ అక్వేరియం, ట్యాంకులు నిర్మించడానికి ఆరు నెలలు పట్టిందని చేపల కోసం కనిష్ట ఉష్ణోగ్రతలు మెయింటెన్ చేస్తున్నామని ఎక్స్‌పో మేనేజర్ పేర్కొన్నారు.