Indira Park VST Steel Bridge: హైదరాబాద్‌ ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి మరో వంతెన అందుబాటులోకి రానున్నది. ఇందిరా పార్క్‌ - వీఎస్టీ మధ్య నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ స్టీల్‌ బ్రిడ్జికి దివంగత బీఆర్‌ఎస్ నేత, మాజీ హోంమత్రి నాయిని నరసింహారెడ్డి పేరు పెట్టారు. ముషీరాబాద్‌లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి, వీఎస్టీ కార్మిక సంఘం నాయకుడిగా నాయిని చేసిన సేవలను స్మరించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌, అశోక్‌నగర్‌, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడిగా ఉన్న ట్రాఫిక్‌ రద్దీ సమస్యను పరిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. వంతెనను ఎస్‌ఆర్‌డీపీ కింద జీహెచ్‌ఎంసీ నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ తొలి హోంమంత్రిగా పని చేసిన నాయిని స్వర్గీయ నర్సింహారెడ్డి పేరును పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని కేటీఆర్‌ పేర్కొన్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పని చేశారని, దశాబ్దాల పాటు వీఎస్టీ కార్మిక సంఘానికి నాయకత్వం వహించారని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 


బ్రిడ్జి నిర్మాణానికి దాదాపు రూ.450 కోట్లు వెచ్చించి నిర్మించారు. వంతెనపై ఎల్‌ఈడీ లైట్లు, క్రాస్ బారియర్ల ఏర్పాటు చేశారు. ఈ వంతెనపై గంటకు 40 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. వంతెన అందుబాటులోకి వస్తే వీఎస్‌టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ మార్గంలోని వాణిజ్య సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, హాస్టల్స్‌, కాలేజీలకు వెళ్లి వచ్చేవారికి ఉపశమనం కలుగుతుంది.


రెండున్నర ఏళ్లలో నిర్మాణం
2020 జులై 10న ఈ ఫ్లైఓర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. కేవలం రెండున్నర ఏళ్లలో 4 లైన్ల రోడ్‌తో స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. రూ.450 కోట్ల అంచనా వ్యయం కాగా 12,500 మెట్రిక్ టన్నుల ఇనుమును ఉపయోగించారు. సన్నటి ఐరన్ పిల్లర్లు 81, 426 దూలాలు నిర్మించారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీద నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. జంక్షన్లు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో 2.6 కిలోమీటర్ల దూరమైన లోయర్ ట్యాంక్ నుంచి వీఎస్టీ వరకు 5 నిమిషాల్లో వెళ్లొచ్చు.


ఫ్లైఓవర్ ప్రత్యేకతలు
నగరంలో పలు చోట్ల ఫ్లై ఓవర్ల పై నుంచి మెట్రో లైన్ ఉంటుంది. కానీ ఇక్కడ మెట్రో లైన్ పైనుంచి వెళ్లేలా ఈ బ్రిడ్జి నిర్మించారు. సిటీలో మెట్రో లైన్‌పై నుంచి వెళ్తున్న తొలి ఫ్లైఓవర్ గా ఈ వంతెన ప్రత్యేకత దక్కించుకుంది. కాంక్రీట్ ఫ్లైఓవర్లతో పోలిస్తే స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి ఖర్చు ఎక్కువై, కానీ తక్కువ టైంలో నిర్మాణాలను పూర్తి చేయొచ్చు. వందేళ్లకు పైగా మన్నిక ఉంటుందట. ఆగస్టు 19న ఈ ఇందిరా పార్క్ టూ వీఎస్టీ స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.