Hyderabad News: అందరిలాగే కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించాడు. కానీ ప్రజల కష్టాలు తీర్చాల్సిన ఆ కానిస్టేబుల్.. కేడీగా మారి దొంగతనాలు చేయిస్తున్నాడు. అంతేనా చోరీ చేసిన సొమ్ములోంచి వాటాలు తీస్కోవడం, వాళ్లు జైలుకు వెళ్తే బయటకు విడిపించడం వంటివి చేస్తున్నాడు. కానీ అతడి అదృష్టం బాగాలేక పోలీసులకు దొరికిపోయాడు. ముందు నేరాలు అంగీకరించకపోయినప్పటికీ.. మెల్లి మెల్లిగా తన నిజస్వరూపాన్ని బయట పెడుతున్నాడు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


నల్గొండ జిల్లాలో ఇటీవల చరవాణుల చోరీలు ఎక్కువ అయ్యాయి. అయితే వాటిపై దష్టి సారించిన జిల్లా పోలీసులు.. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ నిందితులను విచారించగా.. మాకేం తెలీదు, ఇవన్నీ మా సార్ యే చేయిస్తున్నాడంటూ సమాధానం వచ్చింది. మీ సార్ ఎవరంటూ ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ ఈశ్వర్ బండారం బయట పడింది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ ఈశ్వర్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మూడు రోజులు విచారించారు. ముందు నోరు విప్పకపోయినా కాల్ డేటా, హఫీజ్ పేట్, చీరాలలోని నివాసాల్లో దొంగలకు వసతి కల్పించడంపై సాక్ష్యాలు చూపడంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 


అసలేం జరిగిందంటే...?


ఏపీలోని బాపట్ల జిల్లా స్టూవర్ట్ పురంకు చెందిన మేకల ఈశ్వర్... హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించాడు. నేర విభాగంలో పని చేయడంతో అతడికి పలువురు నిందితులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అంతర్రాష్ట్ర ముఠాల ఆచూకీ కోసం అన్ ఫార్మర్ల సాయం తీసుకునేవాడు. సొత్తు రికవరీలో చేతివాటం చూపించేవాడు. కొందరు ఇన్ స్పెక్టర్లు, ఎస్సైలకు భాగాలు పంచేవాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని దొంగలతో ఈశ్వర్ స్నేహ సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. వారి కుటుంబాల్లోని పిల్లలు, మహిళలతో ముఠాలు రూపొందించి హఫీజ్ పేట్ లోని తన నివాసంలో వసతి కల్పించాడు. బహిరంగ సభలు, జనసమ్మర్థ ప్రాంతాలు, రైతు బజార్లు, తదితర చోట్ల పిక్ పాకెటింగ్, చరవాణులు, గొలుసు చోరీలు చేయించాడు. ప్రతినెలా ఆయా కుటుంబాలకు 40 వేల నుంచి 50 వేల రూపాయల వరకు వేతనంగా ఇచ్చేవాడు. ఇలా మొత్తం కానిస్టేబుల్ ఈశ్వర్ కింద 7 ముఠాలు పని చేస్తున్నాయి. 


ఏడు ముఠాలకు హెడ్డుగా ఉంటూ.. చోరీలు 


ఈ ఏడు ముఠాలతో భారీ ఎత్తు బంగారు ఆభరణాలు, చరవాణులు, చోరీ చేయిస్తున్నారు. ఇతని వేదింపులు భరించలేక కొందరు అజ్ఞాతంలోకి, మరికొంత మంది ఇతర రాష్ట్రాల్లో తల దాచుకుంటున్నారు. ఇద్దరు మహిళలను బెదిరించి లైంగికదాడికి పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలపై వివరాలు సేకరిస్తున్నారు. అపహరించిన సెల్ ఫోన్లను సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో విక్రయించాడు. ఈశ్వర్ అరెస్ట్ తో కొందరు సీఐలు, ఎస్సైలలో గుబులు మొదలైంది. నలుగురు సీఐలపై అంతర్గత విచారణ సాగుతోంది. దొంగలతో జమ కట్టిన మరో ఇద్దరు టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు, హోంగార్డులపై కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ బ్రాంచి పోలీసులు, నగర సీపీ సీవీ ఆనంద్ లు ఇంటి దొంగలపై నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. అయితే బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులే.. ఇలా చేయడం చాలా దారుణం అని స్థానికులు అంటున్నారు.