CCTV Captures Laddu Thief in Hyderabad | హైదరాబాద్: వినాయక చవితి వచ్చిందంటే చాలు పలు రకాల ఆకృతుల్లో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. తమ వినాయకుడే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాలని, తమ డిజైన్ బాగుందని అనిపించుకోవాలని యూవత ప్లాన్ చేస్తారు. గణేష్ చతుర్థిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్య విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూ చోరీ కావడం హాట్ టాపిక్ గా మారింది. ప్రతి ఏడాది గణేషుల వద్ద లడ్డూలు ఏదో ఓ చోట చోరీ కావడం వింటూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. 


హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్ శ్రీనివాస్ కాలనీ శ్రీధ అపార్ట్మెంట్ (Srida Towers)లో గణేష్ మండపం ఏర్పాటు చేశారు. వినాయక చవితి సందర్భంగా స్థానిక అపార్ట్మెంట్ అసోసియేషన్ శనివారం నాడు గణేష్ విగ్రహం పెట్టారు. ప్రతి ఏడాదిలాగానే గణేష్ నవరాత్రులను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. అసోసియేషన్ మెంబర్స్ గణేష్ విగ్రహం వద్ద లడ్డూ పెట్టారు. అయితే ఆదివారం తెల్లవారుజామున లేచి చూసి అపార్ట్ మెంట్ వాసులు కంగుతిన్నారు. ఎంతో భక్తితో బొజ్జ గణపయ్య చేతిలో ఏర్పాటు చేసిన పెద్ద లడ్డూ కనిపంచలేదు. శనివారం రాత్రి అందరూ నిద్రించాక, అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్ మెంట్‌లోకి ప్రవేశించాడు. తమ లడ్డూ చోరీ అయిందని, అసోసియేషన్ వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. నిందితుడిని పట్టుకుని బుద్ధి చెబుతామన్నారు.







‘ప్రతి ఏడాది వినాయక చవితి నవరాత్రులను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. కానీ ఈ ఏడాది విచిత్రం చోటుచేసుకుంది. శనివారం గణేష్ విగ్రహం ఏర్పాటు చేశాం. రాత్రి వాచ్ మెన్ నిద్రపోయాక ఓ దొంగ వచ్చి మా వినాయకుడి వద్ద ఏర్పాటు చేసిన లడ్డూ చోరీ చేశాడు. అర్ధరాత్రి వేళ వచ్చి గణేష్ ల వద్ద పెట్టిన లడ్డూలను కొందరు చోరీ చేస్తున్నారు. అయితే వాళ్లు ఎందుకు లడ్డూలు ఎత్తుకెళ్తున్నారు. వాటిని ఏం చేస్తారో తెలియడం లేదు. కానీ ఈ పని చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని’ అపార్ట్ మెంట్ వాసులు పోలీసులను కోరారు.