ACB Raids On CCS ACP Uma Maheshwar Rao House: సీసీఎస్ ఏసీపీ (CCS ACP) ఉమామహేశ్వరరావు (ACP Uma Maheshwar Rao) ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు (ACB Raids) చేపట్టారు. అశోక్‌నగర్‌లోని ఆయన ఇంటితో పాటు ఏకకాలంలో 10 చోట్ల దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో 6 చోట్ల, ఇతర ప్రాంతాల్లో 4 చోట్ల దాడులు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసింది. ఆయనకు ఉన్న స్థిర, చర ఆస్తులు, అప్పులు వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. అలాగే సర్వీసు రికార్డు, ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్‌ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉన్నారు. గతంలో ఆయన ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు. ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమా మహేశ్వరరావు సస్పెండయిన సంగతి తెలిసిందే. డబుల్ మార్డర్ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి.
రాజన్న జిల్లాలో పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్
మరో పక్క తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న జోగినపల్లి భాస్కర్ రావు రూ. ఏడు వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ బిల్లుల మంజూరు కోసం రూ.ఎనిమిది వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో వెంకటేష్ ఏసీబీని సంప్రదించారు. సోమవారం ఏడు వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా భాస్కర్ రావును అదుపులోకి తీసకున్నట్లు డీఎస్పీ వీవీ రమణమూర్తి తెలిపారు.
పట్టుబడిన తహసీల్దార్
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల తాహసీల్దార్ మాధవి ఏసీబీకి చిక్కారు. ధరణి ఆపరేటర్ ద్వారా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కన్నూరు గ్రామానికి చెందిన గోపాల్ మే 9న మీసేవలో విరాసత్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ క్రమంలో గోపాల్ నుంచి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు. తహసీల్దార్ మాధవితోపాటు ధరణి ఆపరేటర్ రాకేశ్ రూ.5 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన అధికారులు ఎమ్మార్వో మాధవి రూ. 5 వేలు, ధరణి ఆపరేటర్ రూ.1000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు లంచం
నల్గొండ జిల్లా చింతపల్లిలో రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఓ విద్యుత్ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. చింతపల్లిలో విద్యుత్‌శాఖ ఉద్యోగిగా వేణు పనిచేస్తున్నాడు. బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు సూర్యనారాయణ అనే రైతును రూ.50 వేల లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వేణును పట్టుకున్నారు. భద్రాద్రిలో రైతు నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ అశ్వారావుపేట ట్రాన్స్‌కో ఏఈ శరత్ కుమార్ ఏసీబీకి చిక్కాడు. వ్యవసాయ క్షేత్రానికి ట్రాన్స్‌ఫార్మర్ ఇచ్చేందుకు కొనకళ్ల ఆదిత్య అనే రైతును లంచం అడిగాడు శరత్‌కుమార్. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులకు శరత్‌కుమార్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అనంతరం అశ్వారావుపేట సబ్ స్టేషన్‌లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.