I Love Muhammad row |హైదరాబాద్: ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin owaisi ) కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో గురువారం (అక్టోబర్ 2)న జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ.. ఈ దేశంలో 'ఐ లవ్ మోదీ' అని చెప్పవచ్చు కానీ, ముస్లింలు మాత్రం మహమ్మద్ పేరు ప్రస్తావించకూడదా అని ప్రశ్నించారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో 'ఐ లవ్ మహమ్మద్' పోస్టర్‌పై వివాదం చెలరేగిన విషయాన్ని ఒవైసీ ప్రస్తావించారు. ఆ తర్వాత ఐ లవ్ మహమ్మద్ నినాదం ఉత్తరప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించి, కొన్నిచోట్ల వివాదాలకు కేంద్రమైంది.
అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఇప్పుడు బీజేపీ వాళ్లు మన మసీదులను కూడా లాగేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ దేశంలో 'ఐ లవ్ మోదీ' అని వాళ్లు చెప్పవచ్చు కానీ, 'ఐ లవ్ మహమ్మద్' అని ముస్లింలు చెప్పకూడదు. మీరు ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మోదీ, ఇతర బీజేపీ నేతల పోస్టర్లు పెడితే సంతోషిస్తారు, కానీ 'ఐ లవ్ మహమ్మద్' పోస్టర్లతోనే వారికి సమస్య వస్తుంది. నేను ముస్లిం అయితే, నేను మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వల్లనే. అంతే, అంతకు మించి ఏమీ లేదు. భారతదేశంలో 17 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ముస్లింలను ఏం చేయాలనుకుంటోంది’ అని ప్రశ్నించారు.
పోలీసుల లాఠీఛార్జ్‌పై ఒవైసీ మండిపాటుమేం ఎల్లప్పుడూ హింసను ఖండిస్తాం. అయితే పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అదే సమయంలో దుకాణదారులు వారిపై పూలు చల్లుతున్నారు. అధికారం ఎవరి చేతిలో ఉంటే పోలీసులు కూడా వారికే మద్దతు తెలుపుతారని అర్థమవుతోంది. అధికారం మారిన తర్వాత, వారు కూడా మిమ్మల్ని రేపు కొట్టే అవకాశం ఉందని అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు.
ఐ లవ్ మహమ్మద్‌కు వ్యతిరేకంగా నినాదాలు
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం నమాజ్ తర్వాత ఐ లవ్ మహమ్మద్‌ను వ్యతిరేకిస్తూ ఇటీవల నిరసనలు జరిగాయి. ఈ సమయంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం పోస్టర్ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. కేంద్ర ప్రభుత్వం ముస్లింలను చిన్నచూపు చూస్తుందని ఒవైసీ ఆరోపించారు. మోదీ పోస్టర్లు వేస్తే, మోదీ నినాదం చేయవచ్చు, కానీ ఐ లవ్ మహమ్మద్ అని మేం అనకూడదా అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.