Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ ఎవరికి ఇవ్వాలని చర్చ కాంగ్రెస్‌లో తీవ్రంగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఓ సమావేశం జరిగింది. ఇందులో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఉపఎన్నికల ఇన్‌ఛార్జ్ మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. వ్యక్తిగత కారణంతో మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమావేశానికి హాజరుకాలేదు. ఈ సందర్భంగా ఉపఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉంది. కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయే విషయంపై చర్చించారు. ముందుగా అభ్యర్థి ఎవరిని పెడితే ఎలా ఉంటుంది, కేంద్ర నాయకత్వానికి ఎవరి పేర్లు సిఫార్సు చేయాలనే విషయంపై కూడా మాట్లాడారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే విజయమని, సర్వేలు అనుకూలంగా ఉన్నాయని సహచర మంత్రులు, పీసీసీ చీఫ్‌కు ముఖ్యమంత్రి వివరించారు. స్థానిక నాయకులతో జాగ్రత్తగా సమన్వయం చేసుకొని పని చేస్తే భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచించారు. ప్రజాబలం, స్థానికుల అండ ఉన్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ఇన్‌ఛార్జ్ మంత్రులు, పీసీసీ చీఫ్‌కు దిశానిర్దేశం చేశారు.
పోటీలో ఎవరెవరు?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్న తొలి ఉప ఎన్నిక ఇది. అందుకే చాలా మంది ఆశావాహులు ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. గతంలో తృటిలో విజయానికి దూరమైన నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి కూడా పోటీలో ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మిగతా నాయకులు చాలామంది రేసులో ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న బలం, ఆర్థిక బలం, ప్రజల నుంచి మద్దతును పరిగణలోకి తీసుకొని వీళ్ల పేర్లు తుది జాబితాలో ఉన్నాయి. వీరి పేర్లను అధిష్ఠానానికి పంపించిన తర్వాత ఒకరు పేరు ఫైనల్ చేయనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు కృషి చేయాలని ముఖ్యమంత్రి నేతలకు దిశానిర్దేశం చేశారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ వల్ల జరిగిన నష్టాన్ని, కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని జనం ముందు చర్చకు పెట్టాలని ముఖ్యమంత్రి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనతో అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తూ రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్న పనులను వివరించాలని తెలిపారు. రాష్ట్ర నాయకుల నుంచి గల్లీ కార్యకర్త వరకు అందరూ సమన్వయంతో వెళ్తే భారీ మెజార్టీ వస్తుందని చెప్పారు.