Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు ఎల్ అండ్ టీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ సేవర్ - 59 ఆఫర్ ను పునః ప్రారంభిస్తున్నట్లు ఎల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న ఈ ఆఫర్ 23వ తేదీ సెప్టెంబర్ 2023 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ అద్భుతమైన ఆఫర్ ను పొందేందుకు ప్రయాణికులు తాము గతంలో కొనుగోలు చేసిన మెట్రో హాలీడే కార్డును ఉపయోగించవచ్చు. లేదా కొత్తగా మెట్రో హాలీడే కార్డును కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ను పొందేందుకు మెట్రో స్టేషన్ లోని టికెట్ కౌంటర్ నుంచి సెలవు జాబితాను అనుసరించి సూపర్ సేవర్ హాలీడేస్ లో కేవలం రూ.59లకే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఎల్ అండ్ టీ మెట్రో అధికారిక వెబ్ సైట్ ను, ఏదైనా మెట్రో స్టేషన్ లో సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.  






గణేష్‌ న‌వ‌రాత్రుల్లో అర్ధరాత్రి ఒంటి గంట వ‌ర‌కు ట్రైన్స్‌


అలాగే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మెట్రో అద్భుతమైన ఆలోచన చేసింది. భక్తుల ప్రయాణం సులువుగా... సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు  చేపట్టింది. భక్తుల ప్రయాణానికి, భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. గణేష్‌ చతుర్ధికి అవాంతరాలు లేని ప్రయాణాన్ని కల్పించేలా మెట్రో రైలు సేవలు పెంచుతామని ప్రకటించింది. గణేష్‌ న‌వ‌రాత్రుల సందర్భంగా మెట్రో రైళ్ల‌ను అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు నడపుతోంది. గ‌తంలో మాదిరిగానే ఈ సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకు వ‌చ్చారు. ఖైర‌తాబాద్ గ‌ణేశ్‌ను ద‌ర్శించుకునే భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు  మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. ఇక, ఖైర‌తాబాద్ స్టేష‌న్‌లో అద‌న‌పు టికెట్ కౌంట‌ర్ల‌ను కూడా ఏర్పాటు చేశారు. భక్తులు టికెట్లు కొనేందుకు ఆలస్యం కాకుండా చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా  టిక్కెట్లు తీసుకుని రైళ్లలో ఎక్కే అవకాశం కల్పించారు. భక్తుల భద్రతకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఖైర‌తాబాద్ మెట్రో స్టేష‌న్ దగ్గర అద‌న‌పు భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ స్టేషన్ దగ్గర మాత్రమే కాకుండా... ఇతర కీలకమైన మెట్రో స్టేషన్లలో దగ్గర కూడా అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. ఖైరతాబాద్ గణేష్ ను చూసేందుకు కేవలం నగర ప్రజలు, తెలంగాణ వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తుంటారు. అందుకే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎల్ అండ్ టీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.