Hyderbaad Metro Rail Timings: హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్ లో స్వల్ప మార్పులను చేశారు. రైలు నడిచే వేళలను పొడిగించాలనే డిమాండ్ లు ఎప్పటి నుంచో ఉన్నందున ఆ దిశగా హెచ్ఎంఆర్ఎల్ (హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్) ప్రయత్నాలు చేస్తోంది. ట్రయల్ లో భాగంగా ఇప్పటికి వారానికి ఒక రోజుపాటు.. చివరి ట్రైన్ నడిచే వేళలను పొడిగించారు. ఈ మార్చిన వేళల్లో భాగంగా ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసులను పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు వివరించారు. ఈ మేరకు ఫేస్ బుక్, ఎక్స్ హ్యాండిల్స్ లో ఒక పోస్ట్ పెట్టారు.
ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్లు మొదలు అవుతాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ దిశగా అధికారులు ట్రయల్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మెట్రో రైళ్లకు ఆ సమయాల్లో ఉన్న ఆదరణ, ప్రయాణికుల రద్దీ, ట్రాక్ నిర్వహణ, కోచ్‌ల మెయింటెనెన్స్ వంటి ఇతర విషయాలను కూడా పరిగణనలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇప్పటికైతే శుక్రవారాల్లో రాత్రి 11.45 గంటలకు టెర్మినల్ స్టేషన్ లో చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని మెట్రో అధికారులు తెలిపారు.