Russia Ukraine Conflict: మేడ్చల్ జిల్లా జీడిమెట్లకు చెందిన తెలంగాణ వైద్య విద్యార్థినులు ఉక్రెయిన్‌లో (Russia Ukraine War) చిక్కుకున్నారు. భయంతో బిక్కుబిక్కుమంటూ బంకర్‌లలో తలదాచుకున్నారు. జీడిమెట్ల షాపూర్ నగర్ కు చెందిన విద్యార్థిని కల్పన కర్క్యూ సిటీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుకుంటున్నారు. ప్రస్తుతం కర్ఫ్యూలో బాంబుల వర్షం మోగుతుందని విద్యార్థిని, ఆమె స్నేహితురాలు పేర్కొన్నారు. తమకు తినడానికి తిండి, నీరు సైతం అందుబాటులో లేదని వీడియోలో పేర్కొన్నారు. సుమారు ఐదు వేల మంది భారత విద్యార్థులు తమ పరిసరాల్లో ఉన్నారని అన్నారు. భారత రాయబార కార్యాలయం నుంచి తమకి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. తమను త్వరగా ఇండియాకి చేర్చాలని వేడుకుంటున్నారు. వారు తలదాచుకున్న బంకర్‌ను విద్యార్థినులు వీడియోలో చూపించారు. కేవలం పశ్చిమం వైపు ఉన్నవారిని మాత్రమే భారత్ కు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


‘‘మేము ఉక్రెయిన్ లోని కార్కీవ్ నగరంలో మెడిసిన్ చదువుకుంటున్నాము. కార్కీవ్, కీవ్ నగరాలు యుద్ధం వల్ల బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పటికే రాజధాని అయిన కీవ్ నగరం మొత్తం డ్యామేజ్ అయిపోయింది. నిన్నటి నుంచి కార్కీవ్ నగరంలో కూడా విపరీతంగా బాంబుల చప్పుడు వినిపిస్తుంది. ప్రతి క్షణం బాంబుల చప్పుడు వినిపిస్తూనే ఉంది. మాకు చాలా భయంగా ఉంది. ఈ బంకర్‌లో మాకు ఫుడ్, వాటర్ ఏమీ లేదు. ఇండియన్ స్టూడెంట్స్ అందరూ 5 వేల మంది వరకూ ఉంటారు. న్యూస్‌లో చూసి ఇండియన్స్ అందరూ వచ్చేశారని అనుకుంటున్నారు.


కానీ, ఇక్కడ తెలుగు వారు కూడా చాలా మంది ఉన్నారు. మమ్మల్ని ఎప్పుడు భారత్‌కు తీసుకెళ్తారనే అంశంపై మాకు ఎలాంటి సమాచారమూ లేదు. పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న ఇండియన్స్ ని తీసుకెళ్లి అందర్నీ తరలించామని చెప్తున్నారు. మాకు ఎలాంటి సమాచారం లేదు. ఇక్కడ ఈ బంకర్‌లో చాలా కాలం ఉండే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడూ చలి. మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రత ఉంటుంది. మాలాగే చాలా మంది వారి అపార్ట్ మెంట్స్, మెట్రో స్టేషన్స్‌లో ఉన్న బంకర్స్‌లోకి వెళ్లిపోయారు.’’


‘‘ఇక్కడ ఫుడ్, వాటర్, కనీసం వాష్ రూమ్స్ కూడా లేవు. ఇప్పుడు మా పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే భయంగా ఉంది. బయట సామాన్య పౌరులకు కూడా తుపాకులు ఇచ్చి పోరాటంలోకి దింపుతున్నారు. ఎవరు ఎలాంటి వారో తెలియకుండా పరిస్థితి ఉంది. సరిహద్దు వరకు వెళ్లమని చెప్తున్నారు.. కానీ, మేం సరిహద్దు నుంచి దాదాపు 1400 కిలో మీటర్ల దూరంలో ఉన్నాం. ఇంటి నుంచి బయటికి వెళ్లే పరిస్థితే లేదు. అలాంటిది సరిహద్దుల వరకూ ఎలా వెళ్లగలం? దయచేసి భారత ప్రభుత్వం స్పందించి మమ్మల్ని సురక్షితంగా తరలించాలని కోరుతున్నాం.’’ అని బంకర్‌లోని విద్యార్థినులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.