రోజూ నవ్వుతూ పలకరిస్తూ స్నేహితుడిలా కనిపించే వారిపట్ల కూడా మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చాటే ఓ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఎన్నో రోజుల నుంచి మిత్రుడిగా మెలిగిన వ్యక్తి ఇచ్చిన ఝలక్‌తో ఆమె అవాక్కయింది. మెకానిక్ ను ఇంటికి పంపి చేయించిన పాడు పనితో ఆ యువకుడి వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని అల్వాల్‌లో ఈ ఘటన జరగ్గా, పోలీసులు వివరాలు వెల్లడించారు.


హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన ఓ మహిళ సెల్ ఫోన్ షాపు నడుపుతూ ఉంది. అక్కడికి ఓ ఫోన్ల కంపెనీలో టీమ్‌ లీడ్ గా పనిచేస్తున్న వ్యక్తి సయ్యద్‌ రియాజ్‌ వస్తుండేవాడు. తమ కంపెనీ సెల్ ఫోన్ల అమ్మకాలు ఎలా సాగుతున్నాయి అని అడిగే నెపంతో తరచూ ఆమె సెల్ ఫోన్ ఫాపుకి వెళ్తుండేవాడు. అలా ఆ మహిళతో మాట కలిపి ఎక్కువ సేపు ఏదో ఒకటి మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. అలా ఓ రోజు ఆ మహిళ షాపులో ఉన్న సమయంలో తన భర్తతో ఇంట్లో గీజర్, ఏసీ పాడైందని, రిపేర్ చేయించాలని ఫోన్లో చెబుతుండగా ఇతను అదంతా విన్నాడు. 


వెంటనే కలగజేసుకొని తాను మెకానిక్‌ను పంపుతానంటూ మహిళకు చెప్పాడు. మర్నాడు మెకానిక్‌ను తీసుకుని మహిళ ఇంటికెళ్లాడు.. రియాజ్‌. అలా ఆమెకు తెలియకుండా మెకానిక్ చేత ఇంట్లో సీక్రెట్ కెమెరాను అమర్చాడు. తర్వాత ఆ మహిళ ఇంట్లోని ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. తన వద్ద నగ్న వీడియోలు, ఫొటోలు ఉన్నాయని, తనను ఇంటికి పిలవకపోతే ఆ వీడియోలను వైరల్‌ చేస్తానని బెదిరించాడు. తాను చెప్పినట్లు చెయ్యకపోతే ఫొటోలు ప్రింట్‌ తీసి ఆమె ఇంటి చుట్టుపక్కల గోడల మీద అతికిస్తానని బెదిరించాడు. దానికి ఆమె లొంగకపోవడంతో ఓ రోజు మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏకంగా ఇంట్లోకి చొరబడ్డాడు. భయంతో ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు. తర్వాత బాధితురాలు పేట్‌ బషీరాబాద్‌ షీ టీమ్స్‌ పోలీసులను ఆశ్రయించింది. తనను వ్యక్తి బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 


ఆకతాయిలకు షీ టీమ్స్ కౌన్సిలింగ్
ఆకతాయిల ఆగడాలు పెరిగిపోవడంతో సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలోని ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ సేఫ్టీ వింగ్‌లో 126 మంది ఆకతాయిలకు గురువారం (డిసెంబరు 1) కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇందులో 20 మంది 18 ఏళ్లకు దిగువన ఉన్నవారు ఉన్నారు. గత నెలలో మహిళలను వేధిస్తున్న 60 మంది ఆకతాయిలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత నెల రోజుల్లో సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో 477 డెకాయ్‌ ఆపరేషన్స్‌ నిర్వహించగా 31 మంది ఆకతాయిలు పట్టుబడ్డారు.


మహిళా ఉద్యోగుల భద్రత, రక్షణ కోసం సైబరాబాద్‌ షీ టీమ్స్‌ అర్ధరాత్రి డెకాయ్‌ ఆపరేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఫుడ్‌ కోర్ట్‌లు, హాస్టళ్లు, మెట్రో స్టేషన్లు, మాదాపూర్‌లోని 100 ఫీట్స్ రోడ్, కూకట్‌పల్లి ఏరియా బస్‌ స్టాప్‌లు లాంటి ప్రాంతాల్లో మఫ్టీలో షీ టీమ్స్‌‌ మహిళా పోలీసులు తిరుగుతూ ఆకతాయిల పని పడుతుంటారు.