Hyderabad IT Scam: ఆదాయపు పన్ను శాఖ రూ.40 కోట్ల పన్ను రీఫండ్ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. ఈ విషయమై హైదరాబాద్, విజయవాడలోని ఐటీ అధికారులు సోదలు నిర్వహిస్తున్నారు. ఆదాయపన్ను రీఫండ్ విషయమై  ఎనిమిది మంది టాక్స్ కన్సల్టెంట్‌లు, రైల్వే, పోలీసు శాఖకు చెందిన చాలా మంది ఉద్యోగులు...  హైదరాబాద్, విజయవాడలోని అనేక టెక్నాలజీ కంపెనీలు ఈ కుంభకోణంలో పాలు పంచుకుని గుర్తించారు. బుధవారం రోజు నిజాంపేట్, ఎల్బీనగర్, వనస్థలి పురంలోని పలు ప్రాంతాల్లో ఐటీ దర్యాప్తు విభాగం అధికారులు సర్వే నిర్వహించారు. ప్రమేయం ఉన్న ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులపై కేసులు పెట్టేందుకు ఐటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. నోటీసులు జారీ చేసి మరీ విచారించనున్నారు. 


ఉద్యోగులు అర్హులు కానప్పటికీ.. కన్సల్టెంట్లు బోగస్ డాక్యుమెంట్లను రూపొందించి సెక్షన్ 80సీసీ, సెక్షన్ 80డీడీ ప్రకారం సరైన డాక్యుమెంటేషన్ లేకుండా రిటర్న్ లు దాఖలు చేశారని ఆదాయపన్ను శాఖ అధికారులు వివరించారు. ఇలా చేయడం వల్ల ఒక్కో కన్సల్టెంట్ దాదాపు 500 నుంచి 1000 వరకు ఐటీ దాఖలు చేశారని చెప్పుకొచ్చారు. కన్సల్టెంట్లు నేరుగా లేదా వారి ఏజెంట్ల ద్వారా రీఫండ్ మొత్తంపై 10% కమీషన్ కోసం తమ రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఉద్యోగులను సంప్రదించారని సీనియర్ ఐటీ అధికారి తెలిపారు. కొందరు ఉద్యోగులకు ఇది మోసపూరిత పథకం అనే విషయం కూడా తెలియదని పేర్కొన్నారు. అలాగే కమీషన్ కోసం వారి ఖాతాల్లో వాపసులను స్వీకరించడానికి కూడా ఇష్టపూర్వకంగా వారు ఆధారాలను అందించారని వెల్లడించారు. 


ఇదే మొదటి సారి కాదు..!


2017లో 200 మంది సాఫ్ట్‌ వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులలో నకిలీ వైకల్యం, దీర్ఘకాలిక అనారోగ్యాల ద్వారా తప్పుడు రీఫండ్‌లను క్లెయిమ్ చేశారని ఐటీ డిపార్ట్‌మెంట్ గుర్తించింది. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ విచారణ జరిపి కన్సల్టెంట్లు, ఉద్యోగులపై చార్జిషీట్ దాఖలు చేసింది. దాఖలు చేసిన అభియోగాలలో ఇద్దరు పన్ను కన్సల్టెంట్లపై ఐపీసీ సెక్షన్లు 420 (మోసం), ఐపీసీ 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) ఉన్నాయి.